కాలేయ మార్పిడిపై కాలయాపన !
రెండేళ్లుగా ఆరేషన్లు చేసేందుకు ఆపసోపాలు జీజీహెచ్‌కు ప్రతిరోజూ చికిత్స కోసం వస్తున్న బాధితులు ఆపరేషన్ చేస్తే ప్రాణాలు కాపాడే అవకాశం శస్త్రచికిత్సలకు మీనమేషాలు లెక్కిస్తున్న ఆసుపత్రి అధికారులు
సమావేశం కాని బ్రెయిన్‌డెడ్ కమిటీ
గుంటూరు మెడికల్: కాలేయ మార్పిడి ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం జనవరిలోనే అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రారంభించకుండా ఆసుపత్రి అధికారులు మీనమేషాల లెక్కిస్తుండటంతో, చికిత్సల కోసం వస్తున్న పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో గతంలో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ప్రతిరోజూ వంద మందికి పైగా పలు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యతో చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో 20 మంది కాలేయ సంబంధిత బాధితులే. వీరికి ఆపరేషన్ చేస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌లో కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ను ప్రభుత్వం 2024 ఏప్రిల్‌లో నియమించింది. అందుకు అవసరమైన మిషన్లు సైతం అందజేసింది. కానీ జీజీహెచ్ అధికారులు ఆపరేషన్లు చేసేందుకు చొరవ చూపించడం లేదు.
జనవరిలో అనుమతి
గుంటూరు జీజీహెచ్‌లో చనిపోయిన వారి అవయవాలను సేకరించి, కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు జీవన్ ధాన్ ట్రస్టు ఈ ఏడాది జనవరిలో అనుమతి ఇచ్చింది. నేటి వరకు ఒక్క ఆపరేషన్ కూడా ప్రారంభం కాలేదు. ప్రతి రోజూ గుంటూరు జీజీహెచ్‌లో 15 నుంచి 20 మంది వరకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల్లో, గాయపడి చికిత్స పొందుతూ చనిపోతున్నారు. వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారు స్వచ్ఛందంగా అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేసే బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రత్యేకంగా కో–ఆర్డినేటర్‌ను నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ పోస్టునూ భర్తీ చేయకుండా మిన్నకుండిపోయారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే, వారి అవయవాలను కుటుంబ సభ్యుల అనుమతితో సేకరించి తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న వారికి అమర్చడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. ఈ ప్రక్రియ కొనసాగించేందుకు తప్పనిసరిగా బ్రెయిన్ డెడ్ కమిటీ అనుమతి కావాల్సి ఉంటుంది. న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్‌లు, సమావేశం నిర్వహించుకుని చికిత్స పొందుతున్న వారు చనిపోయినట్లు నిర్ధారించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ప్లాంట్ కో–ఆర్డినేటర్ పోస్టు భర్తీ చేయకపోవడం, బ్రెయిన్ డెడ్ కమిటీ సమావేశాలు పెట్టకుండా కాలయాపన చేస్తుండటంతో గుంటూరు జీజీహెచ్‌లో కాలేయ మార్పిడి ఆపరేషన్ల ప్రక్రియ ముందుకు కదలడం లేదు.
కాలేయ మార్పిడిపై కాలయాపన !


