శుభ కార్యాలకు బ్రేక్
మూఢంతో 82 రోజుల పాటు అడ్డంకి ఫిబ్రవరి 18 వరకూ లేని ముహూర్తాలు ఆ తరువాత కూడా మార్చి 11 లోపే శుభ ఘడియలు మూగబోనున్న పెళ్లి బాజాలు, వేద మంత్రాలు మాఘ మాసంలోనూ నో చాన్స్ వధూవరులకు తప్పని ఎదురుచూపులు
మాఘ మాసంలో ఆటంకం
ప్రత్తిపాడు: పెళ్లి చేసుకోవాలన్నా.. నూతన ఇంట్లో అడుగు పెట్టాలన్నా.. కొత్త వ్యాపారం ఆరంభించాలన్నా, విగ్రహ ప్రతిష్టలు చేయాలన్నా.. ఇలా శుభకార్యమేదైనా ముందుగా చూసేకునేది ముహూర్తమే. అది బాగుంటేనే పెళ్లి అయినా వ్యాపారమైనా ఒడుదుడుకులు లేకుండా సజావుగా సాగిపోతుందని విశ్వసిస్తుంటారు. అయితే శుభకార్యాలకు ఈ ఏడాది పెద్ద బ్రేక్ పడింది. నవంబరు 30 శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం మార్గ శుద్ధ షష్టి నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) ప్రారంభమైంది. 2026 ఫిబ్రవరి 13 వరకు ఉంటుంది. అనంతరం మాఘ మాసం బహుళ అమావాస్య 17 వరకూ ఉండటంతో అప్పటి వరకూ ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతాయి. అంటే దాదాపు 82 రోజుల పాటు శుక్ర మూఢం ఉండనుంది. మార్గశిర మాసం మొదలైన వారానికే ప్రారంభమైన మూఢం పుష్య, మాఘ మాసాల వరకూ కొనసాగుతోంది. ఈ సమయంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, యజ్ఞాలు, కొత్త వ్యాపారాల ప్రారంభంతో పాటు ఇతరత్రా శుభకార్యాలు చేసుకునేందుకు అవకాశం లేదని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లి బాజాలు, వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాలు మూడు నెలల పాటు మూగబోనున్నాయి.
శుక్ర బలం ఉంటేనే..
సాధారణంగా శుభ కార్యాలు నిర్వహించాలంటే గురు బలం బాగా ఉండాలి. సిరిసంపదలు, సంతోషాలకు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. మౌఢ్యమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనమై తేజస్సు కోల్పోతాయని పండితులు చెబుతున్నారు. అందుకే శుభకార్యాలకు మూఢం సమయం కాదని పండితులు సూచిస్తున్నారు.
ముహూర్తాలకు ప్రతికూలత
సాధారణంగా మాఘ మాసంలో వివాహాలు కుదిరి అగ్ని సాక్షిగా ఒక్కటయ్యేందుకు కాబోయే జంటలు ఎదురు చూస్తుంటాయి. వారి ఊహలకు తగినట్లుగానే మాఘ మాసంలో పెళ్లిళ్లకు కూడా బలమైన ముహూర్తాలు ఉంటాయి. కానీ ఈసారి మూఢంలో కలిసిపోవడంతో ముహూర్తాల్లేని పరిస్థితి ఉంది. రథ సప్తమి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి వంటి తిథులు కూడా మూఢంలో కలిసిపోవడంతో గృహప్రవేశాలకు ప్రతికూలత ఏర్పడనుంది.
బోసిపోనున్న ఫంక్షన్ హాళ్లు
శుక్ర మౌఢ్యమి కారణంగా శుభ కార్యాలకు బ్రేక్ పడటంతో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు బోసి పోనున్నాయి. శుభకార్యాల మీద ఆధారపడ్డ పురోహితులు, డెకరేషన్, షామియానా, సామగ్రి నిర్వాహకులు, వంట మాస్టర్లు, బాజా భజంత్రీలు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు దాదాపు రెండున్నర నెలల పాటు ఉపాధికి ఇబ్బంది ఏర్పడనుంది.
దేవాలయ ప్రతిష్టలు, ఉపనయనాలు, వివాహాలు, శంకుస్థాపన వంటి శుభకార్యాలు సహజంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ, ఫాల్గుణ, వైశాఖ మాసంలో ఎక్కువగా ఆచరించాలన్నది శాస్త్ర ప్రమాణం. అయితే, ఈ సంవత్సరం నవంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు శుక్ర మౌఢ్యమి వల్ల ఆటంకం ఏర్పడింది. మరలా ఫాల్గుణ మాసంలో 2026 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 11వ తేదీలోపు మాత్రమే శుభ ముహూర్తాలున్నాయి. మార్చి 19 తరువాత ఉగాది, శ్రీరామనవమి పండుగలు వెళ్లిన తరవాత అంటే మళ్లీ ఏప్రిల్‌లో గానీ శుభ ముహూర్తాలు లేవు. ఫాల్గుణ మాసంలో శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చు
– జంధ్యాల వేంకట రామలింగేశ్వరశాస్త్రి (ఆగమ పరీక్షాధికారి, గణపతి విద్యాపీఠం నిర్వాహకులు)
శుభ కార్యాలకు బ్రేక్


