ఆరోగ్యమే మహా భాగ్యం
గుంటూరు వెస్ట్: ఆరోగ్యమే మహా భాగ్యమని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ర్యాలీని కలెక్టరేట్ ఆవరణలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఆరోగ్యం .. మన చేతిలోనే ఉందన్నారు. ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ‘హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోండి – సమాచారం కలిగి ఉండండి – సురక్షితంగా ఉండండి‘ అనే నినాదంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ అంటు వ్యాధులు కాదని, వాటికి గురైన వారిపై వివక్ష అవసరం లేదని స్పష్టం చేశారు. వారితో కలసి తినవచ్చు, జీవించవచ్చని చెప్పారు. ఎయిడ్స్ రహిత సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లాలోని 27 ప్రాథమిక, 47 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత హెచ్‌ఐవీ పరీక్షలు, సూచనలు ఇచ్చేందుకు 10 కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.మొబైల్ ఐసీటీసీ ద్వారాను పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. హెచ్‌ఐవీతో జీవించే వారికి ప్రభుత్వం ఏఆర్‌టీ పెన్షన్ రూ.4 వేలు చొప్పున 2,634 మందికి అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో 3.14 లక్షల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్..
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (ఎంపీటీఎం)ను ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ డీఆర్వో షేక్ ఖాజావలితో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించేందుకు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేలా విద్యాశాఖ అధికారులు, మండలస్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పట్టణాలు, గ్రామాల్లో పకడ్బందీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఉగాది నాటికి ప్రారంభించటానికి జిల్లాలో రూఫ్ పూర్తయిన 5,470, రూఫ్ లెవల్ స్థాయిలో ఉన్న 9,100 ఇళ్ల పనులు వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పూర్తి అయ్యేలా హౌసింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధ్యాన్యం కొనుగోలు చేసిన ఆరు గంటల్లోనే రైస్ మిల్లుల్లో రైతులకు అక్‌నాలెడ్జిమెంట్ ఇచ్చేలా తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, డీపీఓ సాయికుమార్, డీఈఓ రేణుక పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా


