అర్జీల పరిష్కారం వేగవంతం
అధికారులకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశం
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి శాఖకు అందుతున్న అర్జీలపై స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. మొత్తం వచ్చిన వాటిల్లో పరిష్కరించినవి, ఇంకా చేయాల్సిన వాటిపై పక్కా సమాచారం ఉండాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఇంకా చూడాల్సిన అర్జీలు ఎన్ని ఉన్నాయి..వాటిపై ఎందుకు జాప్యం జరిగిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని తెలిపారు. కొన్ని సమస్యలు మరలా వస్తున్నాయని (రీ ఓపెన్), వాటికి స్పష్టమైన పరిష్కారం చూపకపోవడం వల్లే అలా జరుగుతున్నాయని భావించాల్సి ఉంటుందని చెప్పారు. పదే పదే వచ్చే అర్జీల్లో పెండింగ్ ఉండటానికి కారణాలు వివరణాత్మకంగా సమర్పించాలని ఆదేశించారు. ప్రతి అర్జీపై ఆడిట్ పక్కాగా జరగాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన 260 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్, జిల్లా అధికారులు పరిశీలించారు.


