కంటిమీద కునుకు కరువు
కంటిమీద కునుకు కరువు ● మోంథా తుఫాన్‌కు ధ్వంసమైన పంటలు
● నష్టం నమోదుకు రాని సిబ్బంది
● బీమా చెల్లించని ప్రభుత్వం
● పరిహారంపై సందిగ్ధం.. ఆందోళనలో రైంతాంగం తెనాలి: పంటలను కకావికలం చేసిన మోంథా తుఫాన్ అదృశ్యమై మూడురోజులు గడచినా శ్రీనివాసరెడ్డి వంటి ఎందరో కర్షకులకు కంటిమీదకు కునుకు రావటంలేదు. పంట నష్టం అంచనా నమోదుకు చేనుకేసి వచ్చిన సిబ్బంది కనిపించటం లేదు. దీనికితోడు బీమా ప్రీమియం చెల్లించక పోవటంతో పరిహారం వస్తుందో రాదోనని మథనపడుతున్నారు. పంటల నష్టానికి ఎంతోకొంత పరిహారం రాకపోతే పెట్టుబడుల నిమిత్తం తీసుకున్న అప్పులు ఎలా తీరతాయని, వడ్డీల భారం ఎలా మోయాలనేది ఇప్పుడు అన్నదాతలకు కనుకుపట్టనీయటం లేదు. ఎవరికివారే రైతు సేవాకేంద్రాలకు వెళ్లి తమ పంట నష్టం వివరాలనే ఏకరువు పెడుతున్నారు.
తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిగా గల సబ్‌డివిజనులో వరి 50,586 ఎకరాల్లో సాగుచేశారు. అపరాలు 2,004 ఎకరాలు, మెట్టపొలాల్లో అరటి 1,456, పసుపు 1,921 ఎకరాల్లో వేశారు. మరో 597 ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. వ్యవసాయ పంటల విస్తీర్ణం 52,721 ఎకరాలు కాగా, ఉద్యాన పంటలు 6,721 ఎకరాల్లో ఉన్నాయి. వరి పైరు బిర్రుపొట్ట, పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ముందుగా వెదజల్లిన కొల్లిపర మండలంలో మరో రెండు వారాల్లో పైరు కోతకు రానున్న దశలో మోంథా తుఫాన్ గత నెలాఖరులో విరుచుకుపడింది. తుఫాన్ ధాటికి వరి పైరు భారీ విస్తీర్ణంలో నేలవాలింది. సబ్ డివిజనులోని మూడు మండలాల్లో 18,110 ఎకరాల్లో వరిపైరు పడిపోయింది. కొల్లిపర మండలంలో 4,500 ఎకరాలు, తెనాలిలో 6,880, దుగ్గిరాలలో 6,836 ఎకరాల్లో వరి నేలవాలిందని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చాలా వరకు బిర్రుపొట్ట, కంకి పాలుపోసుకునే దశలో ఉన్నందున, నేలపడిన పైరు పూర్తిస్థాయిలో పాలుపోసుకునే అవకాశం ఉండదనీ, గింజ పూర్తిగా తయారుకాదని రైతులు చెబుతున్నారు. నేలవాలిన ప్రతిచేలో కనీసం 20 శాతం పంట నష్టం వాటిల్లుతుందని అధికారులూ చెప్పారు.
ఉద్యాన పంటల విషయానికొస్తే, సబ్‌డివిజనులో దాదాపు సగానికి పైగా అంటే 802 ఎకరాల్లో అరటి పైరు ధ్వంసమైంది. 724 ఎకరాల పసుపు చేలల్లో నీరు నిలిచింది. 389 ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. మరో 65 ఎకరాల్లో కంద పంట దెబ్బతింది. వాణిజ్య పంటలైనందున ఆయా పంటలకు పెట్టుబడులు అధికమని తెలిసిందే. పసుపు చేలల్లో నిలిచిన నీరు త్వరితగతిన బయటకు వెళ్లకపోతే దుంపకుళ్లు సోకే ప్రమాదముంది.
రెండెకరాల్లో అరటి ధ్వంసమైంది
మేం సాగుచేస్తున్న రెండు ఎకరాల అరటి చేలో 5–10 శాతం మినహా మొత్తం ధ్వంసమైంది.
మెట్ట చేలకు ఎకరాకు కౌలు రూ.60 వేల వరకు ఉంది. ఒక్కో ఎకరంలో సాగుకు రూ.లక్షకు పైగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు తుఫాన్ ధాటికి ఎకరానికి కనీసం రూ.80 వేల నష్టం వచ్చింది. నమోదుకు ఎవరూ రాలేదు. దీంతో నేను రైతు సేవాకేంద్రానికి వివరాలను పంపాను. గత ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించటంతో అప్పట్లో పసుపునకు రూ.50 వేలు, అరటికి రూ.30 వేల పరిహారం వచ్చింది. కూటమి ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. పరిహారంపై సందేహంగా ఉంది. ఏం చేస్తారో చూడాలి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ఆరిమండ శ్రీనివాసరెడ్డి. నివాసం కొల్లిపర. ఆరెకరాల మాగాణిలో వరి, రెండెకరాల్లో అరటి, మరికొంత విస్తీర్ణంలో పసుపు వేశాడు. మోంథా తుఫాన్‌కు వరి ఆరెకరాల్లోనూ నేలవాలింది. గెలలకొచ్చిన అరటి సగానికి సగం ధ్వంసమైంది. ఎకరాకు రూ.1.10 లక్షల పెట్టుబడి పెట్టారు. పంట నష్టం నమోదుకు ఎవరూ చేలోకి రాలేదు. పరిహారం వస్తుందా? రాదా? అనేది సందిగ్ధం. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు వరదలకు పంటలు దెబ్బతింటే పసుపునకు రూ.50 వేలు, అరటికి రూ.30 వేలు చొప్పున పరిహారం ఇచ్చారు. గతేడాది కూడా వరదలకు రెండు పంటలకు పదేసి వేలొచ్చాయి. అప్పట్లో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించింది. కూటమి ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించలేదు. దీంతో ఈసారి పరిహారం ఇస్తారా? లేదా? అని ఆందోళన పడుతున్నాడు.
ధాన్యం రైతుకు కోలుకోలేని దెబ్బ
తీవ్రంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలు
– బొంతు నాగిరెడ్డి, రైతు, కొల్లిపర
1/2
కంటిమీద కునుకు కరువు
2/2
కంటిమీద కునుకు కరువు