
ఫ్లయ్ ఓవర్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి
గుంటూరు వెస్ట్: నగరంలోని శంకర్ విలాస్, నంది వెలుగు రోడ్డులోని ఫ్లయ్ ఓవర్‌ల నిర్మాణ స్థితిగతులను శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో రూ.98 కోట్ల ఎస్టిమేషన్‌తో శంకర్‌విలాస్ బ్రిడ్జ్‌ను అత్యాధునికంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మణిపురం వంతెన పనులను మళ్లీ ప్రారంభించామన్నారు. ప్రజలకు రానున్న కాలంలో మెరుగైన రవాణా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా అధికారులు వీలైనంత వరకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీనివాస మూర్తి తదితరులు పాల్గొన్నారు.