
రోగులకు మెరుగైన సేవలందించండి
ఘనంగా బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవం
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవాన్ని మార్కెట్ సెంటర్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా బ్యాంక్ ఉద్యోగ సంఘాల కార్యదర్శి బాషా పతాకాన్ని ఆవిష్కరించారు. యూనియన్ సలహాదారు పి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకులు 1969 జూలై 19న బ్యాంకులు జాతీయమై, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలబడ్డాయన్నారు. 1991 తర్వాత ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రాధాన్య రంగాలను పక్కనపెట్టి కార్పొరేట్ శక్తులకు అధిక రుణాలు ఇవ్యడం, అవి తిరిగి కట్టకపోవడంతో బ్యాంకులలో నిరర్థక ఆస్తులు పెరిగి బ్యాంకు లాభాలన్నీ కూడా వాటికి సర్దుబాటు చేయడం వలన బ్యాంకుల ఆదాయం ఆవిరైపోతుందని విమర్శించారు. నాడు బ్యాంకుల జాతీయికరణను వ్యతిరేకించారో వారే నేడు అధికారంలో ఉండడం అనేది ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికికి ప్రమాదకరమని హెచ్చరించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాంక్ ఉద్యోగ సంఘం నాయకులు మురళీ, షరీఫ్, పృథ్వీ, క్రాంతి, సీపీఐ నాయకుడు పి.శివాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గుంటూరు శ్రీనగర్‌లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు.
తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో పారిశుద్ధ్య నిర్వహణను కొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, ప్రతి రోజు వైద్యులు, సిబ్బంది ఈ విషయమై దృష్టి సారించాలని సెకండరీ హెల్త్ విభాగం రాష్ట్ర జాయింట్ కమిషనర్ డాక్టర్ ఎస్.రమేష్‌నాథ్ ఆదేశించారు. తెనాలి జిల్లా వైద్యశాల, తల్లిపిల్లల వైద్యశాలలను శనివారం ఆయన పరిశీలించారు. వైద్యశాలలోని ఓపీని పరిశీలించి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ల్యాబ్‌లను, వార్డులను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. సీటీ స్కాన్ యూనిట్ నిరుపయోగంగా ఉండటాన్ని గమనించిన ఆయన నూతన మిషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అలాగే ఈఎన్‌టీ ఆపరేషన్‌లకు సంబంధించిన మెక్రోస్కోప్ యంత్రాన్ని మంజూరు చేయించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. నవంబర్‌లో వైద్యుల పదోన్నతులు ఉన్నాయని అవి పూర్తి అవగానే తెనాలిలో ఖాళీగా ఉన్న ఫోరిన్‌సిక్, సైక్రాటిక్ వైద్యుల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ బీవీ రంగారావు, వైద్యశాల ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రామాంజనరావు, సీనియర్ వైద్యులు డాక్టర్ జె.హనుమంతరావు, అసిస్టెంట్ ఆర్‌ఎంఓ డాక్టర్ సురేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.600 కోట్లు ఎక్కడ?
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తుందని ఈనెల 12వ తేదీన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారని, వారం రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఇంతవరకు ఒక్క విద్యార్థి ఖాతాలో నగదు జమకాలేదని, మరి 600 కోట్లు ఎక్కడికి వెళ్లాయని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ ప్రశ్నించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్య లింగం భవన్‌లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం వలన దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు తమ డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెకండరీ హెల్త్ విభాగం రాష్ట్ర జాయింట్ కమిషనర్
డాక్టర్ ఎస్.రమేష్‌నాథ్
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ

రోగులకు మెరుగైన సేవలందించండి