
ప్రభుత్వ తీరుపై పసుపు రైతుల ఆగ్రహం
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్‌లో గతేడాది జనవరిలో దగ్ధమైన పసుపు రైతులకు వచ్చిన మొదటి విడత బీమా పరిహారం సరిపోదని, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాకు రూ.7 వేలు చొప్పున ఇవ్వాల్సిందేనని బాధిత పసుపు రైతులు డిమాండ్ చేశారు. తొలి విడత బీమా పరిహారం వచ్చిన నేపథ్యంలో సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహను శనివారం బాధిత రైతులు కలిశారు. గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బీమా పరిహారం చెక్కును అందజేస్తారని సబ్‌కలెక్టర్ వారికి చెప్పారు. రైతులు మాత్రం తమకు బీమాతోపాటు క్వింటాకు రూ.7 వేల చొప్పున సాయం కూడా ఒకేసారి వచ్చేలా చూడాలని కోరారు. మార్కెటింగ్ శాఖ అధికారి, దుగ్గిరాల పసుపు యార్డు కార్యదర్శి కూడా అక్కడకు వచ్చారు. మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్‌తో మాట్లాడి తమ సమస్యకు పరిష్కారం చూపా లని రైతులు కోరారు. ఫోనులో ప్రయ త్నించినా అందుబాటులోకి రావటం లేదని చెప్పి మార్కెటింగ్ అధికారులు వెళుతుండగా, రైతులు ఆందోళన చేశారు. బీమా పరిహారం వరకు తీసుకుంటే అప్పులవాళ్లు తమ వెంటబడతారని, అరకొరా డబ్బులతో అందరికీ సర్దుబాటు చేయటం సాధ్యం కాదన్నారు. ఇబ్బందులు పడతామని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం డబ్బులు ఇవ్వాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. తమలో తాము చర్చించుకున్న అనంతరం రైతులు గుంటూరు వెళ్లి మంత్రి పెమ్మసానితో మాట్లాడి తేల్చుకుందామని బయలుదేరారు.
కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాద బాధితులకు క్వింటాకు రూ.7 వేలు ఇవ్వాలి బీమా పరిహారంతో సరిపెడితే ఎలాగని అన్నదాతల మండిపాటు మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం నగదు కూడా చెల్లించాలని వినతి