
వైఎస్సార్ సీపీ నేతల విచారణ
సత్తెనపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ నమోదైన అక్రమ కేసులో ఇద్దరు వైఎస్సార్ సీపీ నేతలను గురువారం సత్తెనపల్లి టౌన్, సత్తెనపల్లి రూరల్ పోలీస్టేషన్‌లో సీఐలు నాగమల్లేశ్వరరావు, ఎం.వి.సుబ్బారావులు విచారించారు. పెదకూరపాడు మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకర్రావు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణలను వేర్వేరుగా పోలీస్టేషన్లలో విచారించి, వారి నుంచి సమాధానాలు రాబట్టి నమోదు చేసుకున్నారు. వీరి వెంట స్టేషన్‌కు వచ్చిన వారిలో వైఎస్సార్ సీపీ బెల్లంకొండ మండల నాయకుడు చెన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా లీగల్‌సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, సీనియర్ న్యాయవాది మర్రి వెంకట సుబ్బారెడ్డి, క్రోసూరు, అమరావతి మండల నాయకులు నర్రా వాసు, మంగిశెట్టి కోటేశ్వరరావు ఉన్నారు.
విజ్ఞాన్ వర్సిటీకి రూ.58.27 లక్షల ప్రాజెక్ట్
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.ఆర్. చరణ్ రాజకు ఢిల్లీలోని ఏఎన్‌ఆర్‌ఎఫ్– పీఎంఈసీఆర్‌జీ (అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ – ప్రైమ్ మినిస్టర్స్ ఎర్లీ కెరియర్ రీసెర్చ్ గ్రాంట్) నుంచి రూ.58.27 లక్షల విలువ గల ప్రాజెక్టు మంజూరైందని వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ గురువారం తెలిపారు. పరిశోధనకుగాను రాబోయే 3 సంవత్సరాలకు ప్రాజెక్ట్ గ్రాంటు మంజూరైందన్నారు. ఎం.ఆర్. చరణ్ రాజను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు అభినందించారు.