
ప్రాచీన ఆలయంలో చోరీ
తెనాలిరూరల్: రూరల్ గ్రామం కొలకలూరులో అతి ప్రాచీన దేవాలయం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం(శివాలయం)లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఉదయం ఆలయంలో పూజల నిమిత్తం వచ్చిన భక్తులు ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండడం, హుండీ తాళాలు పగలగొట్టి ఉండటానికి గమనించి ఆలయ కార్యనిర్వహణాధికారికి సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం ను పిలిపించి ఆధారాలు సేకరించారు. హుండీలో సుమారు రూ.20 వేలు అపహరణకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహణాధికారి నుంచి ఫిర్యాదు అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతో చరిత్ర కలిగిన పురాతన ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడం గ్రామంలో చర్చనీయాంశమైంది.