
వారధిపై అలుముకున్న అంధకారం
● నిత్యం వందల సంఖ్యలో
వాహనాల రాకపోకలు
● విద్యుద్దీపాలు వెలగకపోవటంతో
తప్పని తిప్పలు
రేపల్లె: పెనుమూడి – పులిగడ్డ వారధి అంధకారంలో మగ్గిపోతోంది. ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై అనుసంధానంగా ఉన్న ఈ వారధి రాష్ట్రంలో రెండో అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీధి దీపాలు మరమ్మతులకు గురవ్వటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వంతెనపై రాత్రివేళ ప్రయాణం చేయడం కత్తిమీద సాములా మారింది. రోజూ వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. పులిగడ్డ – పెనుమూడి మధ్య ప్రయాణించాల్సిన వారికిదే ప్రధాన మార్గం.
గతంలో పలు ప్రమాదాలు
ఇటీవల రేపల్లె మండలం ఆరవపల్లికి చెందిన కుటుంబం మచిలీపట్నం బీచ్‌కి వెళ్లి వస్తుండగా రాత్రి సమయంలో వారధిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా తెనాలికి చెందిన కుటుంబం మోపిదేవి గుడికి కారులో వెళ్తూ వారధిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. రుద్రవరానికి చెందిన యువకుడు, పేటేరుకు చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదం గురై మృత్యువాత పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో పాత దీపస్తంభాలు ఉన్నా కరెంట్ సరఫరా లేదు. ఈ వంతెనపై విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేయడమేకాకుండా, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.