సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్‌గా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన శిరసాల వాసుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. వాసుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గోల్డ్ అప్రైజర్ల సమస్యలు పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో తనను రాష్ట్ర ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాసుబాబు నియామకంపై పలువురు హర్షం వెలిబుచ్చారు. ఆయనను సత్కరించారు.
అప్రైజర్ కుటుంబానికి ఆర్థిక సాయం
ఏపీ గ్రామీణ బ్యాంక్ తిరుపతి బ్రాంచ్‌లో గోల్డ్ అప్రైజర్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ మస్తాన్ కిడ్నీ ఫెయిల్ అయి అనారోగ్యంతో చైన్నె వైద్యశాలలో చికిత్స పొందుతుండటంతో ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ నుంచి రూ.1.05 లక్షలు నగదు ఆదివారం ఆర్థిక సాయంగా అందించారు. మస్తాన్ భార్య జాన్‌బీకి నగదును అందించినట్లు యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ శిరసాల వాసుబాబు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ బాధ్యులు, తదితరులు ఉన్నారు.
శిలాఫలకం ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు
నరసరావుపేటటౌన్: రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామంలో సాగు నీటి సంఘం కార్యాలయ శిలాఫలకాన్ని టీడీపీ గ్రామ నాయకులు శనివారం ధ్వంసం చేశారు. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భవన నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీన్ని గ్రామ టీడీపీలోని వ్యతిరేక వర్గం ధ్వంసం చేసింది. దీంతో టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ధ్వంసం చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వీరవట్నం గ్రామ నీటి సంఘం మాజీ అధ్యక్షుడు వెలగమూరి వెంకటనారాయణ రొంపిచర్ల పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.

శిరసాల వాసుబాబు