
భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి
మంగళగిరి/ మంగళగిరి టౌన్: తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భక్తిపారవశ్యం పరవళ్లు తొక్కింది. ఆలయాలన్నీ భక్తజనంతో కిక్కిరిశాయి. భక్తులు గంటలు తరబడి క్యూలైన్‌లో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళగిరి నగర పరిధిలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. పూజారులు ముందుగా స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రాజ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు. స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి గరుడ వాహనంపై వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో వేడుకలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ అడిషనల్ కమిషనర్ సునీల్ కుమార్ పర్యవేక్షించారు.
ఆలయాల్లో విశేష పూజలు గరుడ వాహనంపై దర్శనమిచ్చిన నృసింహస్వామి కిటకిటలాడిన దేవాలయాలు