
ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు కాజేశారు
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో లక్షలాది రూపాయలు కాజేసి, మోసగించారంటూ బాధితులు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ నిర్వహించారు. అర్జీదారుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), శివాజీ (క్రైం), రమేష్ (ట్రాఫిక్) కూడా అర్జీలు స్వీకరించారు.
నకిలీ నియామక పత్రాలతో మోసం
గతేడాదిలో తెలిసిన వ్యక్తి పరిచయమయ్యారు. నేషనల్ హెల్త్ అథారిటీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ముగ్గురం కలిసి అతనికి సుమారు రూ.16.80 లక్షలు చెల్లించాం. గతేడాది నవంబర్ 4న ఢిల్లీ వెళ్లగా, అవి నకిలీ గుర్తింపు కార్డులు, నియమాక పత్రాలను అధికారులు బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో అటువంటి సంస్థ లేదని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించాం. దీంతో డబ్బులు అడగ్గా, రూ.3.80 లక్షలు మాత్రమే చెల్లించాడు. మిగతా డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
– ఓ యువకుడు, రావెల, తాడికొండ మండలం
పొలం ఇప్పించాలి
గుంటూరు రూరల్ పరిధిలోని వెంగళాయపాలెంలో మాకు 46 సెంట్లు పొలం ఉంది. 2006లో మాజీ ఎమ్మెల్యే సోదరుని వద్ద దాన్ని రూ.5 లక్షలకు తనఖా పెట్టాం. మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి మాకు డబ్బు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేకు అప్పగించాడు. పొలం తనఖాకు సంబంధించి డబ్బులతో పాటు అదనంగా చెల్లిస్తామని, కాగితాలు ఇవ్వాలంటూ ప్రాథేయపడుతున్నా కనికరించడం లేదు. మాకు పొలం ఒక్కటే జీవనాధారం. గతంలో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. న్యాయం చేయాలి.
– సీహెచ్.భాగ్యలక్ష్మి, రామారావు, వెంగళాయపాలెం
ఎస్పీ సతీష్‌కుమార్‌కు బాధితుల మొర