జగనన్న గృహాల పరిశీలన | Sakshi
Sakshi News home page

జగనన్న గృహాల పరిశీలన

Published Wed, May 22 2024 9:05 AM

జగనన్న గృహాల పరిశీలన

లేఅవుట్లను సందర్శించిన ఢిల్లీ సెక్రటేరియట్‌ బృందం

ప్రత్తిపాడు: ఇళ్లు ఎలా ఉన్నాయి? నిర్మాణానికి ఎంత ఖర్చయింది? ప్రభుత్వం ఎంత ఇచ్చింది? మీకు అదనంగా ఎంత ఖర్చయింది? కాలనీలో వసతులు ఎలా ఉన్నాయి? అంటూ ఢిల్లీ సెక్రటేరియట్‌ అధికారుల బృందం హౌసింగ్‌ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడులోని జగనన్న హౌసింగ్‌ లే అవుట్‌ను మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లుగా చేస్తున్న ఆరుగురు అధికారుల బృందం సందర్శించింది. సెక్రటేరియట్‌ ఏఎస్‌ఓలు జలేష్‌యాదవ్‌, అమర్‌దీప్‌ చౌహాన్‌, ధృవ్‌ దమిజా, కపిల్‌, పూజా, శృతి కాలనీలోని ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. విద్యుత్‌ సౌకర్యం, డ్రెయినేజీ సౌకర్యం, మంచి నీటి కుళాయిలు ఉన్నాయా లేవా అన్న విషయాలను గృహాల్లోకి వెళ్లి పరిశీలించారు. కాలనీలో ఇబ్బందులు లేవని లబ్ధిదారులు బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఉచితంగా ఇంటి స్థలాన్ని అందించిందని, రిజిస్ట్రేషన్‌ చేసి మరీ తమకు డాక్యుమెంట్లు అందజేసిందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను బృంద సభ్యులకు చూపించి ఆనందం వ్యక్తం చేశారు.

● అనంతరం నడింపాలెం గ్రామంలో బృందం పర్యటించింది. సంపద కేంద్రం (సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌)లో గ్రామ పంచాయతీ చేస్తున్న వర్మీ కంపోస్టు తయారీని పరిశీలించారు. నాణ్యత బాగుండటంతో అధికారుల బృందం 12 ప్యాకెట్లను కొనుగోలు చేసింది.

● తుమ్మలపాలెంలో పర్యటించిన బృందం ఆ గ్రామంలో అమలవుతున్న జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని పరిశీలించింది. బృందం వెంట నోడల్‌ ఆఫీసర్‌ నాగానంద్‌, అసిస్టెంట్‌ నోడల్‌ ఆఫీసర్‌ జీవీఆర్‌ గుప్తా, డీపీఆర్‌సి డీటీఎం నాగేశ్వరరావు, ప్రత్తిపాడు మండల ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ షేక్‌ ఖాజా, పంచాయతీ కార్యదర్శి జాన్‌పీరా తుమ్మలపాలెం శివాజీ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement