గుంటూరు రేంజ్‌లో ఇద్దరు సీఐల బదిలీ | Sakshi
Sakshi News home page

గుంటూరు రేంజ్‌లో ఇద్దరు సీఐల బదిలీ

Published Sat, Nov 18 2023 1:58 AM

-

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): గుంటూరు రేంజ్‌లో ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ జి.పాలరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు పశ్చిమ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ (పీఎస్‌) సీఐగా విధులు నిర్వహిస్తున్న పి.అక్కేశ్వరరావుని బాపట్ల జిల్లాలోని మార్టూరు సర్కిల్‌ పీఎస్‌కు, గుంటూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ సీఐ కుమ్మరి శ్రీనివాసరావుని గుంటూరు పశ్చిమ ట్రాఫిక్‌ పీఎస్‌కు బదిలీ చేశారు.

రేపు సీనియర్‌

ఖోఖో జట్ల ఎంపిక

నకరికల్లు: ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్‌ ఖోఖో జట్ల ఎంపిక ఆదివారం నిర్వహించనున్నట్లు ఖోఖో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చింతా పుల్లయ్య శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాల న్యూ క్యాంపస్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సెలక్షన్స్‌ ప్రారంభమవుతాయని తెలిపారు. సీనియర్‌ బాలబాలికలు సెలక్షన్స్‌కు హాజరుకావచ్చన్నారు. వయస్సుతో నిమిత్తం లేదని అడ్రస్‌ ధ్రువీకరణ కోసం ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాలని అన్నారు. ఎంపికై న జట్లు డిసెంబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు మార్కాపురంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. వివరాలకు కె.ఆదిబా బు, 9985373066ను సంప్రదించచ్చన్నారు.

జలజీవన్‌ మిషన్‌, జగనన్న గృహ నిర్మాణాలపై సమీక్ష

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రామీణ నీటి సరఫరా–పారిశుధ్య శాఖ ఇంజినీర్లతో శుక్రవారం జలజీవన్‌ మిషన్‌, జగనన్న గృహ నిర్మాణాలపై ఆర్‌డబ్ల్యూఎస్‌అండ్‌ ఎస్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్వీ కృష్ణారెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీ ప్రాంగణంలోని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయా కార్యక్రమాల ప్రగతిపై ఇంజినీర్లతో చర్చించారు. నిర్ధేశిత సమయానికి పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్‌ఈ ఆర్‌.సురేష్‌, పల్నాడు డీఆర్‌ఈ ఆర్‌ఎస్‌ఆర్‌ సురేష్‌, ఇంజినీర్లు పాల్గొన్నారు.

రేపు బాల్‌ బ్మాడ్మింటన్‌ పోటీలు

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు) : జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్‌లో జిల్లా స్థాయి సీనియర్‌ మెన్‌, ఉమెన్‌ బాల్‌ బ్మాడ్మింటన్‌ పోటీలు నిర్వహిస్తామని జిల్లా కార్యదర్శి ఇ.శివశంకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి వచ్చేనెల 8 నుంచి 10 వరకు అనంతపూర్‌ జిల్లా రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామంలో జరగబోయే రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. వివరాల కోసం 93969 90666 సంప్రదించాలన్నారు.

నేడు కుల గణన సర్వేపై ప్రత్యేక సమావేశం

నెహ్రూ నగర్‌ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన కులగణన సర్వేపై శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, స్టాక్‌ హోల్డర్స్‌తో రెవెన్యూ కల్యాణ మండపంలో అభిప్రాయ సేకరణ, సూచన నిమిత్తం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎస్సీ వెల్ఫేర్‌ డీడీ మధుసూదన్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారని వివరించారు.

యార్డులో 26,755 బస్తాల మిర్చి విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు శుక్రవారం 26,425 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 26,755 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,800 నుంచి రూ.23,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి 24,100 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం క్వింటాలుకు రూ.15,000 నుంచి రూ.23,000 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.11,000 నుంచి 27,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.7,000 నుంచి రూ.12,800 వరకు ధర పలికింది. యార్డులో ఇంకా 8,772 బస్తాల మిర్చి నిల్వ ఉంది.

Advertisement
 
Advertisement