ఆ ఇంట్లో దోపిడీ.. తెలిసిన వ్యక్తి పనే

ఐటీ అధికారులమని చోరీకి పాల్పడిన కేసులో పురోగతి

దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

నగరంపాలెం: ఐటీ అధికారులమని చెప్పి మహిళను తుపాకీతో బెదిరించి రూ.యాభై లక్షలు, అర కిలో బంగారం ఆభరణాలతో ఉడాయించిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ దోపిడీకి సూత్రధారిగా వ్యవహరించిన ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గుంటూరు నగరంలోని పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రగతినగర్‌ ఐదో వీధికి చెందిన వై.కల్యాణి ఇంటికి గురువారం రాత్రి ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఐటీ అధికారులమని చెప్పి, ఇంట్లో ప్రవేశించారు. గుర్తింపు కార్డులు అని చూయించి నగదు, ఆస్తి పత్రాలు, బంగారం తీసుకురావాలని అడగ్గా, కల్యాణి, రాములమ్మ తిరస్కరించారు. దీంతో తమ వెంట తెచ్చుకున్న తుపాకీని వారికి చూపించి బెదిరించారు.

వెంటనే ట్రంక్‌ పెట్టెలో ఉంచిన రూ.యాభై లక్షలు, నగలతో దుండగులు పరారైన విషయం తెలిసిందే. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పాతగుంటూరు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, పరారైన దుండగుల ఆచూకీ గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దోపిడీకి కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తిని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో కేసు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. గుంటూరు నగరంలోని ఓ సినిమా థియేటర్‌ యాజమాని బాధితురాలైన కల్యాణి ఇంట్లో నగదు, నగలు భద్రపరిచినట్లు తెలిసింది.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top