క్రీడల్లో ప్రావీణ్యంతో సవాళ్లను అధిగమించొచ్చు

ఏఎన్‌యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ జాన్సన్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థతతో అధిగమించగలరని ఏఎన్‌యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పి.జాన్సన్‌ పేర్కొన్నారు. శుక్రవారం అమరావతిరోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో స్పర్ధ పేరుతో ఏర్పాటు చేసిన అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీడాంశాల్లో శిక్షణ పొందిన విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా గెలుపు, ఓటములను తేలిగ్గా తీసుకునే ఆత్మ విశ్వాసం కలుగుతాయని అన్నారు. కళాశాల చైర్మన్‌ జూపూడి రంగరాజు, ఏఎన్‌యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల అభివృద్ధికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు.

ముందుగా క్రీడాజ్యోతిని వెలిగించిన ప్రొఫెసర్‌ జాన్సన్‌, పావురాలను, బెలూన్లను ఎగురవేశారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి కబడ్డీ రిఫరీ వెలగా అమ్మయ్య, కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.మధుసూదనరావు, గౌరవ చైర్మన్‌ డాక్టర్‌ మన్నవ రాధాకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీ నాగభూషణం, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. రవికుమార్‌, ఫార్మా.డి డైరెక్టర్‌ పి. సీతారామయ్య, ఫిజికల్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ అజిత్‌బాబు, ఎస్వీఎస్‌ లక్ష్మీనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పది పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి నూరు శాతం ఉత్తీర్ణత నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పాఠశాల విద్య ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు పేర్కొన్నారు. గుంటూరు డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం పాత బస్టాండ్‌ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్జేడీ సుబ్బారావు మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తరగతులను నిర్వహించాలని సూచించారు. డీఈఓ పి.శైలజ మాట్లాడుతూ 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన బైజూస్‌ ట్యాబ్‌లను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. సమావేశంలో గుంటూరు డీవైఈఓ కె.సుధాకర్‌రెడ్డి, డైట్‌ ప్రిన్సిపాల్‌ సుభానీ, ఎంఈఓ అబ్దుల్‌ ఖుద్దూస్‌, ఉర్దూ డీఐ షేక్‌ ఎండీ ఖాసిం పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top