బంద్‌లు ఎందుకు విఫలం అవుతున్నాయి?

TDP Bandh Not Success In AP Guest Column Ilapavuluri Murali Mohan Rao - Sakshi

సందర్భం

మొన్నామధ్య చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఆఫీసులోకి ఎవరో కొందరు వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రవేశించి నాలుగు అద్దాలు పగలగొట్టారంటూ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ పిలుపును ప్రజలు ఖాతరు చెయ్యలేదు. ప్రభుత్వ కార్యా లయాలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, బస్సులు, ఆటోలు యథావిధిగా తమ కార్యకలా పాలను నిర్వహించుకున్నాయి. కొన్నిచోట్ల పేదలు ప్రయాణించే వాహనాలను ఎందుకు అడ్డుకుంటున్నా రని మహిళలు తిరగబడ్డారు. అంతదాకా దేనికి? సాక్షాత్తూ చంద్రబాబు కుటుంబం నిర్వహించే హెరి టేజ్‌ స్టోర్స్‌ సైతం ఆరోజు తెరిచే ఉంచారు. 

పది పదిహేనేళ్ళ క్రితం వరకు ఏ రాజకీయ పార్టీ బంద్‌ పిలుపిచ్చినా ప్రజలు పాటించే వారు.  ఒకవేళ ఎవరైనా తెరుస్తారేమోనని ఉదయాన్నే రాజకీయ పార్టీల కార్యకర్తలు కర్రలు చేబట్టి  బలవంతంగా మూయించేవారు. బస్సులు డిపోలు దాటి బయటకు వచ్చేవి కావు. రెండో మూడో వస్తే కార్యకర్తలు ధ్వంసం చేసేవారు. బంద్‌ కారణం సహేతుకమా, నిర్హేతుకమా అనేది ప్రశ్న కాదు. తమ బలాన్ని ప్రదర్శిం చగలిగామా లేదా అనేదే పాయింట్‌.  

ఇప్పుడు బందుకు ప్రజలనుంచి చెప్పుకోదగిన స్పందన రావడం లేదు. పాతికేళ్ల క్రితం నుంచి అమలుచేస్తున్న ఆర్థిక సంస్కరణల ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు క్షీణించిపోయాయి. విద్యాధికులకు ప్రయివేట్‌ సంస్థలే దిక్కయ్యాయి. అనేక ఐటీ కంపె నీలు లక్షలమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. సాధారణ కిరాణా దుకాణాలు (ప్రస్తుతం వాటిని మాల్స్‌ అంటున్నారు) సైతం బహుముఖంగా విస్తరిం చడమే కాక దేశం మొత్తం తమ స్టోర్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. బందుల పేరుతో వాటిని అడ్డుకుంటే వ్యాపార ప్రయోజనాలే కాదు, లక్షలాదిమందికి ఉపాధి సైతం పోయే ప్రమాదం ఉంది.

మరొక కారణం ఏమిటంటే, ఒకప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ఒక రేషన్‌ కార్డు మాత్రమే. ఇప్పుడలా కాదు, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలవారికి ఏవో రకమైన సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. పింఛన్లు, పథకాల ద్వారా తెల్లకార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ ఏడాదికి సుమారు లక్ష రూపా యలపైనే లబ్ధి కలుగుతున్నది. తెలంగాణలోనూ  డజ న్‌కు పైగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పార్టీలు పిలుపిస్తే మొదటగా స్పందించేది బడుగు వర్గాల వారే కదా! వారికి ఎలాంటి ఇబ్బందీ లేనపుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే బందుల్లో ఎందుకు పాల్గొనాలి అని ఆలోచిస్తున్నారు.  

ఇంకా ముఖ్యమైనది, ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రభావం తగ్గిపోవడం. ఒకప్పుడు కమ్యూ నిస్టులకు విశ్వవిద్యాలయాల విద్యార్థులు మద్దతుగా నిలబడేవారు. బంద్‌ పిలుపిస్తే వెంటనే రంగంలోకి దిగి జయప్రదం చేసేవారు. ప్రస్తుతం యువత తమ కెరియర్‌ మీద దృష్టి సారించింది. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు సమాధి అవుతుందనే వివేచన అంకురించింది.

కరుడుగట్టిన కమ్యూనిస్ట్‌ నాయకులు సైతం తమ పిల్లలను విదేశాలు పంపించి చదివిస్తూ కార్పొరేట్‌ వ్యాపారసంస్థల్లో ఉన్నతస్థానాలకు ఎది గేట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో వైభవాన్ని అను భవించిన కమ్యూనిస్ట్‌ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు తోకల్లా మారిపోయి విలువను పొగొట్టుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే విపరీ తంగా కులాభిమానం ప్రబలి తమ కులస్థులైన ఇతర పార్టీలవారితో అంటకాగుతూ తమ పార్టీలను సర్వ నాశనం చేసుకున్నాయి. అందుకే కమ్యూనిస్టులు బంద్‌ పిలుపిచ్చినా ఒక్కరు కూడా ప్రతిస్పందించడం లేదు.

ఇక తెలుగుదేశం పిలుపిచ్చే బంద్‌ నేపథ్యం తెలి యనంత అమాయకులు కాదు కదా ప్రజలు! మీ వ్యాపారసంస్థలు మీరు నిర్వహించుకుంటూ ఇతరులు నిర్వహించే వ్యాపారాలను ఎందుకు మూసెయ్యాలి అని అడుగుతున్నారు. మీరు లగ్జరీ కార్లలో దర్జాగా తిరుగుతూంటే పేదప్రజానీకం ప్రయాణించే బస్సు లను ఎందుకు ఆపాలని నిగ్గదీసి అడుగుతున్నారు. అందుకే బందులు చాలాకాలంగా విఫలం అవు తున్నాయి. 
వ్యాసకర్త సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు

-ఇలపావులూరి మురళీ మోహనరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top