పులసలు అంత అలుసై పోయాయా?

Political satire on Chandrababu - Sakshi

సరిగ్గా చెప్పిన టైమ్‌కి వెళ్లి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు కళ్యాణం. కొంచెం సేపటికి తలుపు తెరచుకుంది. బద్ధకంగా ఆవులిస్తూ, ఒళ్ళు విరుచుకుంటూ ఎదురుపడ్డాడు కైలాసం. ‘ఓ నువ్వా, ఏంటి?’ అన్నాడు. ‘ఏం లేదు నాన్నగోరు పిలిచారు వచ్చాను.  ఆయన కూడా నిద్రపోతున్నారా?’ అన్నాడు. ‘లేదు. ఆయన ఏడ నిద్రపోతాడు? ఆయన నిద్రపోడు.  మమ్మల్ని నిద్ర పోనివ్వడు. కానీ నేను లెక్క చేయను. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. ఆయనకు మాత్రం నిద్ర రాదు. సరే మీరు మాట్లాడుకోండి.  నాకు నిద్ర వస్తుంది అంటూ లోపలికి వెళ్ళిపోయాడు కైలాసం. ఇంతలో చంద్రయ్య బయటకు వచ్చాడు. ఆ రావయ్యా రా! భోజనం చేద్దూ!’

‘‘వద్దులేండి బాబూ! మీ ‘పప్పు’ భోజనం నేను తినలేను సామీ. మీ అబ్బాయికి ఇష్టమని మీరు పప్పు భోజనానికి అలవాటు పడిపోయారు. నావల్ల కాదు లేండి!’  ‘ఓహో! పులస లేనిదే ఫుడ్‌ తినవన్న మాట!’ ‘‘ఏటండి బాబూ? పులసల్ని అంత  తేలిగ్గా తీసేయకండి. ‘పుస్తెలు అమ్మైనా పులసలు తినాలి’ అంటారు.’’ ‘అమ్ము తావయ్యా నీ దగ్గర ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా పుస్తెలు ఉంటాయ్‌ జేబులో’ అన్నాడు చంద్రయ్య. ఆ మాటలకు ఉలిక్కి  పడ్డాడు కళ్యాణం. ‘ఏటండోయ్‌! మీ దగ్గర నుంచి కూడా డబల్‌ మీనింగ్‌ డైలాగ్లు వొత్తన్నయ్‌!’ వేళ్ళతో జుట్టు ఎగరేస్తూ అన్నాడు.  ‘ఓరి ఓరి ఓరి  నేను ఆ ఉద్దేశంతో అనలేదయ్యా! చేపలు తినటానికి పుస్తెలు అమ్ముకోవడం ఏంటని అన్నాను అంతే! 

సరే సరే! ఆ సంగతి వదిలేసి పాయింట్‌కి రా! ఇంతకీ నేను చెప్పింది ఏం తేల్చావ్‌?’ ‘అంత తక్కువ మందితో వర్క్‌ అవుట్‌ అవ్వదండీ’. ‘ఊరుకోవయ్యా మాట మాట్లా డితే వర్కౌట్‌ వర్కౌట్‌ అంటుంటావ్‌! మనుషులు తగ్గారని నీ ప్యాకేజీ నేనేం తగ్గించట్లేదుగా? ఎంతమంది అయితే నీకెందుకు, నీకు ఇస్తానన్నది నీకు ఇచ్చేస్తా.  మనోహరానికి ముందే చెప్పాగా నీకు చెప్పలేదా?’ ‘నిజమే అనుకోండి! కానీ ప్యాకేజీ మాత్రమే కాదుగా? ప్రిస్టేజీ కూడా కాస్త చూసుకోవద్దూ. అంతమందికి ఆశలు పెట్టి మీరు ఇప్పుడు అంతమంది వద్దూ అంటే వాళ్ళు ఊరుకుంటారా? నేనేం సమాధానం చెప్పాలి? 

‘కళ్యాణం జోకులేయొద్దు. ప్రిస్టేజీ ఏంటయ్యా ప్రిస్టేజీ? మీటింగ్‌ పెట్టి, చేతిలో దీపం లేదని, చుట్టూ చీకటని, సముద్రం తలవంచదు లాంటి అర్థం కానివి ఏవో చెప్తావుగా? అలాంటివే చెప్పు. ఎప్పటిలాగే హైదరాబాద్‌ వెళ్లి కొన్ని రోజులు బ్రేక్‌ ఇచ్చేయ్‌! మళ్ళీ ఫ్రెష్‌గా రీఎంట్రీ ఇవ్వు. నీకు అలవాటేగా? మాకంటే ఇది నిత్య పోరాటం. నిత్య ఆరాటం. నీకు ఇది ఓ బెనిఫిట్‌ షో లాంటిది. తేడా లేదూ! వినటానికి కాస్త కటువుగా ఉంటుంది కానీ నేను నీకు ఒక నిజం చెప్పనా? సంవత్సరానికి ఒకసారి వచ్చి ఓ హడావుడి చేసి మళ్ళీ మాయమైపోయే పులసల్లాగా మీ వాళ్ళు కూడా అంతేనయ్యా! నాలుగు రోజులు హడా వుడి అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ల పనులు, వాళ్ళ వ్యవహారాల్లో  మునిగి పోతారు. మేము అలా కాదు. మా వృత్తి, ప్రవృత్తి, ఆశ, శ్వాస, ధ్యాస అంతా ఇదే.

 నిద్రలేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు మాకు ఇదే యావ’ అన్నాడు చంద్రయ్య. ‘సార్‌ ఏదో బేరం కుదుర్చుకున్నా కదా అని మీరు మరీ చులకన చేసి మాట్లాడుతున్నారు.’ ‘చులకన కాదయ్యా, 45 ఏళ్లఇండస్ట్రీ అనుభవంతో చెబుతున్నా. ఆ మాటకొస్తే నువ్వు కూడా అప్పుడప్పుడు కనిపించి మాయమయ్యే పులస లాంటోడివి.  కాకపోతే నీకు నాతో డీల్‌ కుదిరింది కాబట్టి ఈ పార్ట్‌ టైమ్‌ వ్యవహారం మంచి లాభదాయకంగా ఉంది.

వాళ్ళు నిన్ను నమ్ముకుని నువ్వేదో  ఉద్ధరిస్తావ్‌  అను కున్నారు.  అదే వాళ్ళ అమాయకత్వం’ అంటూ లో లోపల గొణుకుక్కున్నాడు చంద్రయ్య . ‘ఏంటి సార్‌! లో లోపల ఏదో అనుకుంటున్నారు?’ చంద్రయ్య హావభావాల్ని గమ నించి అడిగాడు కళ్యాణం. ‘నీ గురించే నయ్యా.  పాపం నిన్ను నీ వాళ్ళు నమ్ముకున్నారు అటు ఢిల్లీ వాళ్లూ  ఆశలు పెట్టుకున్నారు.  కానీ నువ్వు మాత్రం నా ప్యాకేజీకే కమిట్‌ అయ్యావ్‌! మరి నెక్‌స్ట్‌ నీ ఫ్యూచర్‌ ఏంటి అని ఆలోచి స్తున్నాను.’ ‘అదేంటి మన బంధం పదేళ్ల వరకు ఉంటుందనుకున్నాంగా?’

‘‘పాపం ‘నాది యూజ్‌ అండ్‌ త్రో’ పాలసీ అని తెలిసి కూడా నిజంగా అంత నమ్మకం పెట్టుకున్నాడా?’’ మనసులో ప్రశ్నించుకున్నాడు చంద్రయ్య. అతడి  మనోభావాల్ని చదివినట్టు కళ్యాణం ఒక అరనవ్వు నవ్వి, ‘నిజంగా తన మాటల్ని నమ్మాను అనుకుంటున్నాడు.  పదేళ్లు పార్ట్‌ టైమ్‌ వ్యవహారాలతో నన్ను నమ్మిన వాళ్లు నా వెనుకున్నారు అని తెలియదా తనకి? ఇదే నమ్మకాన్ని మరో పదేళ్లు క్యాష్‌ చేసుకుంటా. తను కాకపోతే ఇంకొకళ్ళు. ఆ టైమ్‌కు ఎవరో వస్తారు ఏంటంట? పులసల మీద ఎదవ జోకులు ఏస్తున్నాడు. పులసలంటే అంత అలుసై పోయాయా?’ అనుకొని గొంతు సవరించుకుంటూ, ‘‘సరే సార్‌ నా గురించి మీరు ఆలోచించకండి. 

ముందు మీరు మీ బలగంతో ఎంతవరకు సక్సెస్‌ అవు తారో ఆలోచించుకోండి! ఈ నాలుగు రోజులు హడావుడి అయిపోతే నా దారి నేను పోతా! మీరు మాత్రం ఎప్పటి లాగే, మీ పరిభాషలో చెప్పాలంటే ‘ఆ విధంగా ముందుకు బోవాలి’. మీరు చెప్పినట్టే నా మనుషులను తగ్గించుకుంటా. ప్యాకేజీ ఏమీ మారదు అన్నారు కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. మిగతా నా గొడవ ఏదో నేను మేనేజ్‌ చేసుకుంటా’’ అన్నాడు.కళ్యాణం మాటల్లో అంతరార్థం గ్రహించడానికి చంద్రయ్య ఆలోచనలో పడ్డాడు!

వ్యాసకర్త పూర్వ సంపాదకులు 

whatsapp channel

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top