బాబు ఎత్తులతో పార్టీ నిలుస్తుందా?

Kommineni Srinivasa Rao Article On Chandrababu Naidu Political Steps - Sakshi

అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఊసు పట్టని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ‘వాటీజ్‌ దిస్‌ దౌర్జన్యం’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తన హయాంలో వైసీపీ నేతలను పోలీసుల ద్వారా ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది కూడా మరిచినట్టున్నారు. ఇప్పుడు అదే పోలీసులు ఎంత సంయమనంతో, మర్యాదతో వ్యవహరించినా ఆయన అరాచకంగానే ఉండదలిచినట్టు అర్థం అవుతోంది. ఇంత అనుభవం ఉన్న నేత, మాజీ ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నట్టు? కారణం స్పష్టం. పంచాయతీ ఎన్నికల ఫలితాలు మింగుడుపడటం లేదు. అందుకే వైసీపీ ప్రభంజనంలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి ఎన్ని ఎత్తులైనా వేస్తున్నారు. ఎన్ని ట్రిక్కులైనా ప్లే చేస్తున్నారు.

‘పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. నన్నే అడ్డగి స్తారా? మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నా. ఎక్కడున్నా వదిలిపెట్టను. అధికారం వచ్చాక మీ అంతుచూస్తా.’ ఇవి ఒక సన్నివేశంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పిన డైలాగులు. మరో సన్నివేశం చూద్దాం. కొందరు పోలీసు అధికారులు చంద్రబాబును బతిమిలాడు తున్న దృశ్యాలు. ఒక పోలీసు అధికారి అయితే మోకాళ్లమీద కూర్చుని చేతులు జోడించి చంద్రబాబును వేడుకుంటున్న వైనం.

చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి అనుభవంతో వ్యవహ రిస్తే ఇలా చేస్తారా? పన్నెండేళ్ల ప్రతిపక్ష నేత అనుభవంతో పద్ధతిగా ఉంటే ఇలా చేయగలరా? పోలీసులు సామాన్య పౌరుడు ఎవరైనా ఎయిర్‌పోర్టులోగానీ, పబ్లిక్‌ ప్రదేశంలోగానీ అడ్డంగా కూర్చుని నిరసన చెబితే సహిస్తారా? బాబు విషయంలో ఎందుకు అంత సంయ మనంతో వ్యవహరించారు? బాబుకు భయపడి కాకపోవచ్చు. ఆయన అన్నేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడని పోలీ సులు గౌరవించారు. కానీ దాన్ని చంద్రబాబు నిలబెట్టుకోగలిగారా?

చిత్తూరు, తిరుపతిల్లో ఐదువేల మందితో ధర్నా చేయాలని తలపెట్టి పోలీసుల అనుమతి కోరితే రద్దీ ప్రదేశాల్లో ధర్నా కుదరదనీ, ఎన్నికల ప్రక్రియకు కూడా ఆటంకమనీ చెప్పారు. ఎన్నికల కమిషన్‌ అనుమతి తెచ్చుకుని ఏమైనా చేసుకోండని సూచించినా టీడీపీ పట్టిం చుకోలేదు. పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిసినా బాబు కావాలని ఉదయానే బయల్దేరి విమానంలో రేణిగుంట విమానాశ్ర యానికి వెళ్లారు. ఇక్కడ మరో విషయం చెబుతున్నారు. ఆయన కుప్పంకు వెళ్లడానికి బెంగళూరుకు విమానంలో వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని తీసుకుంటారు. నిజంగానే చిత్తూరు వెళ్లదలిస్తే ఆ పని చేసి ఉండవచ్చు. పైగా రెండు రోజుల క్రితమే ఆయన కుప్పం పర్యటన చేసి వచ్చారు. అప్పుడు ఈ ఆలోచన రాలేదనుకోవాలి. ఆ తర్వాత వేసుకున్న ప్లాన్‌ ప్రకారం ఆయన కావాలని తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయాన్ని ఎంపిక చేసుకున్నారు. అంటే విమానా శ్రయంలోనే సీన్‌ సృష్టించాలని నిర్ణయించుకున్నారని అర్థం అవు తుంది. ఆ క్రమంలో ఆయన లాంజ్‌లో కుర్చీలున్నా కావాలని నేల మీద కూర్చున్నారు. పోలీసులు తెచ్చి వేసిన కుర్చీలో కూడా కూర్చో లేదు. ఒక గంట సీన్‌ తర్వాత వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి కూర్చుని సాయంత్రం ఏడు గంటల వరకు గడిపి అప్పుడు విమానం ఎక్కారు. ఈలోగా వేరే విమానం ఎక్కించడానికి ప్రయత్నించినా అంగీకరించలేదు. పోలీసులు గట్టిగా వ్యవహరించదలిస్తే ఎత్తుకెళ్లి విమానంలో కూర్చోబెట్టేవారు. కానీ చాలాసేపు బతిమిలాడుతూ అభ్యర్థించారు. అయినా ఆయన మొదటే ‘వాట్‌ ఈజ్‌ దిస్‌ దౌర్జన్యం, ఇది ప్రజాస్వా మ్యమా’ అంటూ కేకలు వేయడం, తదుపరి నేల మీద కూర్చోవడం, వాటిని ఆయనతోపాటు ఉన్న పీఏ వీడియో తీసి మీడియాకు పంపడం ద్వారా కావాల్సినంత పబ్లిసిటీని పొందారు.

పబ్లిసిటీ వరకు సఫలం అయినట్లే. కానీ ఆయనకు సానుభూతి రాలేదనిపిస్తుంది. ఒక పోలీసు అధికారి మోకాళ్లమీద కూర్చుని బతిమి లాడుతున్న సన్నివేశంతో చంద్రబాబుపై కన్నా పోలీసులపైనే సాను భూతి కలిగే అవకాశం ఏర్పడింది. ఈలోగా టీడీపీ నేతలు బాబును ఏదో చేసేస్తున్నారంటూ ప్రచారం చేశారు. బాబుకు తినడానికి కూడా ఏమీ పెట్టలేదన్నట్లుగా ప్రచారం జరిగింది.  ఒక సమాచారం ప్రకారం పోలీసులు అన్ని సదుపాయాలు కల్పించారు. కాఫీ వంటివి ఆయన అడిగి తాగారట. తనతో పాటు తీసుకెళ్లిన భోజనం, డ్రై ప్రూట్స్‌ వంటివి తిన్నారు. ఆయన వయసు రీత్యా ఆహారం తీసుకోవడం మంచిదే. కానీ ఏమీ పెట్టలేదని ప్రచారం జరగడమే దురదృష్టకరం.

ప్రస్తుతం పోలీసు అధికారులు ఎన్నికల కమిషనర్‌ పరిధిలో ఉన్న ప్పటికీ, ఈ గొడవను ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వానికి పులమడానికి విశ్వప్రయత్నం జరిగింది. గతంలో ఒక సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష నేత జగన్‌ ఒక అధికారిని ఉద్దేశించి పద్ధతిగా వ్యవహరించడం లేదని అన్నారని ఆరోపిస్తూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర టీడీపీ మంత్రులు నానా విమర్శలు చేశారు. విశాఖపట్నంలో సముద్ర తీరాన ప్రత్యేక హోదా నిరసనలో భాగంగా కొవ్వొత్తుల ప్రదర్శనకు హాజర వడానికి జగన్, మరికొందరు వైసీపీ నేతలు వెళితే వారిని రన్‌వే పైనే నిలిపేసి వెనక్కి పంపించిన చంద్రబాబు ఇప్పుడు పోలీస్‌ ఆఫీసర్లను బెదిరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు 2014–19 కాలంలో చిత్తూరు జిల్లాలో పోలీసు 30 యాక్టు అమల్లో ఉందట. ప్రత్యేక హోదా కోసం నిరసన చేపట్టాలన్నా అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్‌ నిబంధనలు, కోవిడ్‌–19 నిబంధనలు అమల్లో ఉన్నాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయం తెలియంది కాదు. చౌకబారు రాజకీయాల కోసం తన అనుభవాన్ని పణంగా పెడుతున్నట్లుగా ఉంది.

గతంలో కొందరు వైసీపీ నేతలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా వేధించిందన్నది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, ఎంపీగా ఉన్న మిథున్‌ రెడ్డి ఎయిర్‌ పోర్టులో ఒక ఉద్యోగితో గొడవపడ్డారని ఆరోపించి ఆయన విదేశాల నుంచి రాగానే విమానాశ్రయంలోనే అరెస్టు చేసి నెల్లూరు జిల్లాలో జైలుకు పంపించారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఒక సందర్భంలో పోలీసు వాహనంలో ఎక్కించి తమిళనాడు సరిహద్దుల్లో తిప్పారు. కనీసం మందులు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత జైలులో ఒక అధికారి ఆయనపై దౌర్జన్యం చేశారట. మరో ఎమ్మెల్యే రోజా మహిళా సాధికారత సదస్సు కోసం విజయవాడ విమానాశ్రయంలో దిగగానే ఆమెను బలవంతంగా కారు ఎక్కించి హైదరాబాద్‌ తరలించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ఒకరు ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం చేయడం, ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ ఎంపీ, ఎమ్మెల్సీ దురుసుగా వ్యవహరించడం లాంటి ఘట్టాలు చాలానే ఉన్నాయి. అప్పుడు అవి జరిగాయి కాబట్టి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా చేయవచ్చని కాదు. కానీ పోలీసులు ఇంత గౌరవంగా చూస్తే కూడా చంద్రబాబు బెదిరించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంతో కొంత రాజకీయ లబ్ధి పొందాలన్న తాపత్రయంతోనే ఇలాంటి నాటకీయ సన్నివేశాలను సృష్టించారు.

కుప్పంతో సహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఎనభై శాతం పైగా పంచాయతీలను గెలుచుకుంది. అవే ఫలితాలు మున్సిపల్, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పునరావృతమైతే తెలుగుదేశం పార్టీని మరో మూడేళ్లు గట్టిగా నిల బెట్టడం కష్టం అవుతుంది. అందువల్ల కొత్త ఎత్తుగడలతో తెలుగుదేశం ఉనికిని కాపాడుకోవాలని చంద్రబాబు విశ్వయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు నిజంగానే ఈ ప్రభుత్వంపై ఆరోపణలు చేయదలిస్తే ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే అనేక ఫిర్యా దులు  ఆయన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక రాజకీయ పార్టీగా చేయవలసినవి ఏమీ చేయకుండా, జగన్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడానికే రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లారని అర్థం అవుతోంది. ఇలాంటి చిట్కాలు గతంలో చాలా ప్రయోగించారు. కానీ ఇప్పుడు ఆ రోజులు కావు. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు కౌంటర్లు వచ్చేస్తు న్నాయి. చిత్తశుద్ధి లేని శివపూజలేల అన్నట్లుగా తను అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఊసే పట్టని చంద్రబాబుకు ఇప్పుడు ఆయన ఎలా అరాచకంగా వ్యవహరించదలిచినా అనుమతించాలని భావిస్తున్నారు. అదే ప్రజాస్వామ్యమని ఆయన ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడికి దీనివల్ల సానుభూతి వచ్చిందా? రాజకీయ ప్రయోజనం కలిగిందా? అన్నది త్వరలోనే తేలిపోతుంది.

కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top