బాబు నిర్వాకం ‘ఆంధ్ర’కు శాపం

chandrababu naidu mistake now face andhra pradesh - Sakshi

విశ్లేషణ

తెలంగాణలో ఇకపై స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ  ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం ప్రైవేటు పరిశ్రమలలో సెమీ స్కిల్డ్‌ కేటగిరిలో 80 శాతం, స్కిల్డ్‌ ఉద్యోగాలలో 60 శాతం స్థానికులకే ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహక విధానాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. దీనిపై ఒక ఆంగ్ల పత్రిక ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ విధానంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువత ఆందోళన చెందుతున్నారన్నది ఆ క«థనం సారాంశం. నిజంగానే ఇది ఆలోచించవలసిన అంశమే. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలోను, ఆ తర్వాత జరిగిన పరిణామాలను గమనంలోకి తీసుకుంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ నాయకత్వం ముందు చూపు లేకుండా అనుసరించిన విధానాల వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఒకవైపు అమెరికా వంటి దేశాలలో స్థానికులకే ఉద్యోగాలు అంటూ నిర్ణయాలు చేయడంతో ఆ దేశాలకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు ఏపీ ఇంకా పారిశ్రామికంగా పుంజుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చి ఉండేవేమో! కానీ ఆనాటి సీఎం చంద్రబాబునాయుడు యూటర్న్‌ తీసుకుని ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ ఇవ్వండని కేంద్రంతో రాయబారంలో ఒప్పుకోవడంతో ఆ ప్రత్యేక హోదా ఒక కలగా మిగిలిపోయింది.

పైగా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం ఆంధ్ర యువతకు శాపంగా మారింది. ఆ కేసు తప్పించుకునే క్రమంలో మాత్రం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని, ఇక్కడ విభజన చట్టం సెక్షన్‌ 8 అమలు చేయాలని, దాని ప్రకారం హైదరాబాద్‌పై గవర్నర్‌దే అధికారమని వాదించేవారు. కాని ఆ తర్వాత ఆ కేసులో బీజేపీ వారి ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాజీపడి తెల్లవారేసరికల్లా పెట్టె, బేడా సర్దుకుని విజయవాడ వెళ్లిపోయారు. కానీ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు అంటే 2024 వరకు ఉండే అవకాశం ఏపీకి ఉంది. ఆ తర్వాత కేంద్రాన్ని కోరితే మరికొంతకాలం పొడిగించేదేమో! ఈలోగా ఏపీలో రాజధానికి అవసరమైన ఏర్పాట్లు, ఇతరత్రా పరిశ్రమలు వంటివాటిని ఆకర్షించి అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెంచగలిగితే అప్పుడు హైదరాబాద్‌పై ఆధారపడే పరిస్థితి ఉండేది కాదు.
 
కానీ చంద్రబాబు హైదరాబాద్‌ను, అక్కడ ఉండే ఆంధ్రులకు కాస్తో, కూస్తో ఉన్న హక్కులను కేసీఆర్‌కు తాకట్టు పెట్టి వెళ్లిపోయారు. ఏపీకి వెళ్లి అమరావతి రాజధానిని ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చి, మిగిలిన కాలం అంతా విదేశీయాత్రలు, రాజధాని కబుర్లతో జనాన్ని ఊదరగొట్టారు. చంద్రబాబే కనుక సీఎం అయిన వెంటనే ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రజలకు ప్రత్యేకించి యువతకు ఉపాధి హక్కు కొంతకాలం పాటు ఉండేందుకు కృషి చేసి ఉంటే ఈరోజు ఆందోళన చెందే పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆయన ఆ దిశగా ఎన్నడూ ఆలోచించలేదు. అధికారంలో ఉన్నప్పుడే కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రులకు చాలా నష్టం చేశారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంత టీడీపీ నేతలంతా సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండాలని చెప్పినా, చంద్రబాబు ఒకటికి రెండుసార్లు విభజన లేఖ ఇచ్చారు. విభజన లేఖ ఇచ్చే సమయంలో అయినా ఆంధ్రులకు కావల్సినవి ఇవి అని, ప్రత్యేకించి హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది కనుక ఇక్కడ యువతకు ఉపాధి హక్కు, విద్యా  హక్కు ఉండాలని, స్థానికత్వం ఇలాంటి సమస్యలేవి అడ్డుగా ఉండరాదని కోరారా అంటే అదీ చేయలేదు. కేవలం గుడ్డిగా విభజించండని లేఖ ఇచ్చారు. అదేమంటే రాష్ట్ర విభజన జరగదులే.. తెలంగాణ టీడీపీ నేతలను సంతృఫ్తి పరచడానికి, తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్న టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి మాత్రమే లేఖ ఇస్తున్నానని పార్టీ నేతలతో చెప్పేవారు. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాలే తప్ప, ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. పోనీ విభజన నిర్ణయం జరిగిన తర్వాత దానికి కట్టుబడి ఏదైనా ఒక విధానం అవలంబించారా అంటే పూర్తిగా రివర్స్‌ అయి ఆంధ్ర ప్రజలను రెచ్చగొడుతూ సోనియా అన్యాయంగా విభజన చేసిందని  ప్రచారం చేశారు.

2009 ఎన్నికలకు ముందు ఆనాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కాంగ్రెస్‌ అధిష్టానం ఒక ప్రకటన చేయించింది. వైఎస్‌ అప్పుడు వ్యూహాత్మక ప్రకటన చేశారు. గతంలో ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ విభజనకు సూత్రప్రాయంగా అనుకూలమే కానీ అన్ని ప్రాంతాల స్టేక్‌ హోల్డర్స్‌ ప్రయోజనాలను కాపాడాలని, అందరితో చర్చించాలని, అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని ఆయన పెద్ద జాబితానే చదివారు. వాటిలో నదీ జలాల అంశం నుంచి, హైదరాబాద్‌ గురించి వరకు పలు అంశాలు ప్రస్తావించారు. ఆ ప్రకటన చూసిన వారందరికి ఒక విషయం అర్థం అయింది. రాష్ట్ర విభజనలో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నారు. కానీ వైఎస్‌ రెండోసారి సీఎం అయిన కొద్ది కాలానికే అనూహ్యంగా మరణించడంతో మొత్తం పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా గందరగోళంగా వ్యవహరించింది. సీఎంగా జగన్‌కు బాధ్యత ఇవ్వాలని 145 మంది ఎమ్మెల్యేలు కోరితే వారి మాట వినకుండా కాంగ్రెస్‌ అధిష్టానం రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆంధ్ర, రాయలసీమ ఎమ్మెల్యేల ఆందోళన, రాజీ నామాల హెచ్చరికతో మళ్లీ వెనక్కి తగ్గింది. తర్వాత శ్రీకృష్ణ కమిషన్‌ను నియమించారు. మళ్లీ రాజకీయంగా రోశయ్యను మార్చి కిరణ్‌కుమార్‌ రెడ్డిని సీఎంగా చేశారు. ఆ సమయంలో ప్యాకేజీ ఇస్తామని అధిష్టానం చెప్పడం, ఈయన కొంతకాలం ఆగాలని అనడం, ఈలోగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలు చేయడం వంటి పరిణామాలతో పరిస్థితి చేయిదాటిపోయిందని కాంగ్రెస్‌ అధిష్టానం భావించింది. 

విభజనకు వ్యతిరేకంగా ఎవరు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా హైకమాండ్‌ నాటి సీఎం కిరణ్‌ను ఏమాత్రం పట్టించుకోని నేపథ్యంలో విభజన జరిగిపోయింది. ఆ క్రమంలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఉండే ఆంధ్ర, రాయలసీమ వాసుల ప్రయోజనాలు కాపాడవలసిన అగత్యం ఉందని పలువురు మేధావులు చెబుతున్నా, సీఎంగా ఉన్న కిరణ్‌ కానీ, ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు కానీ పట్టించుకోలేదు. దాని ఫలితమే ఇప్పుడు ఈ సమస్య. అప్పట్లో వైఎస్సార్‌సీపీ పాత్ర తక్కువ. వారు ఆర్టికల్‌ 3 కింద కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని, చెప్పినా, తదుపరి పూర్తిగా తమ వైఖరి మార్చుకుని సమైక్య రాష్ట్రమే తమ విధానమని ప్రకటించారు. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ ఉండడంతో అన్ని ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. పెట్టుబడులు పెట్టారు. కానీ కేసీఆర్‌ 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే 1956కి పూర్వం ఉన్నవాళ్లు.. ఆ తర్వాత వచ్చినవాళ్లు అంటూ ఒక విధానం తీసుకు రావడానికి ప్రయత్నించగా, దానిపై పెద్ద వ్యతిరేకత రావడంతో ఆయన వెనక్కి తగ్గారు.
 
ఇప్పుడు మళ్లీ స్థానిక అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రైవేటు పరిశ్రమల గురించి స్థానిక రిజర్వేషన్‌లు పెడితే ఆంధ్రా నుంచి వచ్చే వేలాదిమంది యువతకు ఇబ్బంది రావచ్చు. హైదరాబాద్‌లో ఉన్నన్ని అవకాశాలు ఏపీలో ఇంకా రాలేదన్నది వాస్తవం. చంద్రబాబు పాలనలో 16 లక్షల కోట్ల పెట్టుబడి వస్తోందని, ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అని అంకెల గారడి మాత్రమే చేశారు తప్ప ఏదీ జరగలేదు. ఆ తర్వాత ఆయన ఓటమి పాలై ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది కాలంలో నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీల ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి పెట్టారు. అవన్నీ కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఏపీలో కూడా 75 శాతం స్థానికులకే రిజర్వేషన్‌ చట్టం తెచ్చిన మాట నిజమే. కానీ ముందుగా పరిశ్రమలు వస్తే, ఆ తర్వాత అది ఉపయోగపడుతుంది. కొన్ని ఇతర రాష్ట్రాలలోను స్థానిక రిజర్వేషన్‌ల చట్టాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అవి కొంత అమలు అవుతున్నాయి. అయితే తెలంగాణలో కనుక నిజంగానే ఆ స్థానిక రిజర్వేషన్లు అమలు అవడం ఆరంభం అయితే, ఆంధ్ర రాయలసీమల నుంచి వచ్చే యువతకు చాలా నష్టం జరుగుతుందన్నది వాస్తవం. అదే కిరణ్‌కుమార్‌ రెడ్డి, చంద్రబాబులు కనుక హైదరాబాద్‌పై ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికి పదేళ్లో, లేక ఒక ఇరవైఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలలో స్వేచ్ఛగా పని చేసుకునే హక్కును కల్పించగలిగి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు.

ఇప్పుడు ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగన్‌పై కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏపీలో సత్వర పారిశ్రామికాభివృద్ధి చేయడం అందులో ఒకటి. పైగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై మరో నాలుగేళ్లపాటు ఏపీకి కూడా హక్కు ఉన్నందున, దాని ప్రకారం ఆంధ్ర ప్రాంత యువకులను కూడా స్థానికులుగానే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగలిగితే బాగుంటుంది. స్థానిక అన్న పదానికి స్పష్టమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇక్కడ పుట్టి ఉండడం, లేదా ఏడో తరగతి లోపు నాలుగేళ్లు వరుసగా చదవడం, ఏడేళ్లు నివాసం ఉండడం వంటివి ఉన్నాయి. ఈ కేటగిరిలోకి రాని ఆంధ్ర యువతకు హైదరాబాద్‌లోని పరిశ్రమలలో స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించడం అవసరం అని చెప్పాలి. అయితే అది అంత తేలికకాదు. ఒకసారి స్థానిక రిజర్వేషన్లు అమలు ఆరంభిస్తే, అందుకు భిన్నంగా ఆంధ్రులకు అవకాశం ఇస్తే, తెలంగాణ ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగుతాయి. నిరసనలు చేస్తాయి. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తాయి. అందువల్ల కేసీఆర్‌ కూడా ఈ విషయాన్ని ఆలోచించి స్థానికత, పరిశ్రమలకు ప్రోత్సాహకాల గైడ్‌లైన్స్‌ ఇవ్వడానికి ముందుగానే, కొంత ఉదారతతో వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పాలి. చంద్రబాబునాయుడి రాజకీయానికి, కిరణ్‌కుమార్‌ రెడ్డి నిష్క్రియాపరత్వానికి ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ యువత బలికాకుండా చూడడం ఎలా అన్నదానిపై ఏపీ ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంటుందని చెప్పక తప్పదు.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
కొమ్మినేని శ్రీనివాసరావు

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top