చైనా కట్టడిలో భారత్‌ పాత్ర కీలకం

Bharat plays Key Role To Stop China - Sakshi

సందర్భం

జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎంపికై తన బృందాన్ని ఎంచుకున్న తర్వాత అమెరికా విదేశీ విధానం ఎలా ఉండబోతుంది అనే అంశంపై పలు చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వ్యవస్థలో కోల్పోయిన తన ప్రతిష్టను అమెరికా తిరిగి చేజిక్కించుకోగలుగుతుందా, బైడెన్‌ భారత్‌ అనుకూల విధానాలను చేపడతారా లేదా అనే అంశాలపై విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ముందు అమెరికా అధ్యక్షుడిగా జోసెఫ్‌ బైడెన్‌ ఎంపిక అమెరికాకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వ్యవస్థకు కూడా కీలకమైన ఘటన అని మనం అర్థం చేసుకోవాలి. రెండు కారణాల వల్ల ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒకటి, చైనా ప్రపంచాధిపత్యశక్తిగా శరవేగంగా ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్యం విషయంలో ప్రపంచం తీవ్ర మార్పులకు గురువుతున్న సందర్భంగా బైడెన్‌ అమెరికా అధ్యక్షుడయ్యారు. రెండు, చైనాను బైడెన్‌ నిలువరించకపోతే, ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం మరింత క్షీణించిపోతుంది. అందుకే జో బైడెన్‌ హయాంలో అమెరికా విదేశీ విధానాన్ని నిర్ణయించే ప్రధాన శక్తిగా చైనా నిలబడనుంది. అదెలాగో చూద్దాం.

ఒకటి, 2017లో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి సంవత్సరంలో చైనా రెండు ప్రధాన లక్ష్యాలను ప్రకటించుకుంది. 2049 నాటికి ఆధునిక సోషలిస్టు దేశంగా మారడం, ప్రపంచాధిపత్య శక్తిగా ఆవిర్భవించడం. ప్రపంచంలో ప్రతిచోటా మేడ్‌ ఇన్‌ చైనా ముద్రను స్పష్టంగా కనిపిం చేలా చేయడం, ప్రపంచ మార్కెట్లను నియంత్రించడం ద్వారా ఈ లక్ష్యాలు సాధించాలని చైనా నిర్దేశించింది. రెండు, ఈ లక్ష్యాల సాధనకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ముడి సరుకులు, ఇంధన వనరులు, మార్కెట్లు, మౌలిక సౌకర్యాల కల్పన, పెట్టుబడులు, భద్రతా సహకారం వంటివి సమకూర్చుకోవడం చైనాకు చాలా ముఖ్యం. దీంట్లో భాగంగానే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ)ని చైనా ప్రారంభించింది. దీనికింద, నూతన యూరేసియా, చైనా–కేంద్ర ఆసియా–పశ్చిమాసియా, చైనా పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్లు నేరుగా చైనాను యూరోపియన్, మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికన్‌ దేశాలతో వాణిజ్యం కోసం రైల్, రోడ్‌ నెట్‌వర్క్‌లతో అనుసంధానమవుతాయి.

చైనా హిందూ మహాసముద్రంపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, మలక్కా డైలెమాను పరిష్కరించుకోవాలంటే ఈ కారిడార్లు చైనాకు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనవి. ప్రస్తుతం చైనా మొత్తం సముద్ర ఇంధన దిగుమతులలో 80 శాతం మలక్కా జలసంధి ద్వారా జరుగుతోంది. భారత్, అమెరికా ఆధిపత్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నందున ఇది వ్యూహాత్మకంగా చైనాకు బలహీన అంశంగా ఉంటోంది. భారత్, అమెరికాలు జపాన్, ఆస్ట్రేలియా వంటి ఇతర ప్రాంతీయ శక్తులతో చతుర్ముఖ చర్చలను సాగిస్తూ చైనాకు పోటీనిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా, ఇరాన్, బెల్చ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ సభ్య దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చైనా విదేశీ విధానం కేంద్రీకరించింది.

మూడు, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అంచనా ప్రకారం ఆసియాలో మౌలిక వసతుల కల్పన విషయంలో ఉన్న కొరతలకుగాను 26 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు కావల్సి ఉంది. ఈ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించే విషయంలో అమెరికా కానీ దాని మిత్ర దేశాలు కానీ ఎలాంటి వ్యూహాత్మక చొరవను తీసుకోవడం లేదు. అదేసమయంలో చైనా 8 ట్రిలి యన్‌ డాలర్ల అంచనాతో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ను మొదలెట్టేసింది. ఈ ప్రాజెక్టులలో 89 శాతం కంటే అధికంగా చైనా కంపెనీలకే కట్టబెట్టారు. అంటే చైనా పెట్టిన పెట్టుబడులలో చాలావరకు చైనాకే తరలి వచ్చేస్తాయి. వాస్తవార్థంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్నించడం ద్వారా యావత్‌ ప్రపంచంపై చైనా ఆధిపత్యం విస్తృతమవుతుంది. నాలుగు. ఆసియా, ఆఫ్రికా, యూరేషియాలో చైనా ఉనికి విస్తరిస్తున్నందున, చైనా ఇక ఏమాత్రమూ అమెరికాకంటే తక్కువ స్థానంలో కాకుండా తనపట్ల సమాన సంబంధాలతో వ్యవహరించాలని కోరుకుంటోంది.. చైనా కమ్యూనిస్టు పార్టీ 2013 విదేశీ వ్యవహారాల సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ చేసిన ప్రసంగం దీన్నే ప్రతిబింబించింది. ‘విజయం కోసం తపనపడుతున్నాం’ అంటూ జింగ్‌ పింగ్‌ చేసిన ప్రకటన నిమ్న స్థాయి నుంచి డైనమిక్, దూకుడు లక్ష్యాలవైపుగా చైనా విదేశీ విధానం పరివర్తనను ప్రతిబిం బించింది. చైనా వ్యూహాత్మక కీలక స్థానాల్లో అత్యాధునిక సైనిక సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ వస్తోంది. దీనివల్లే దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, తైవాన్, హాంకాంగ్, ఆప్రికా, లడఖ్‌లలో చైనా సైన్యం దూకుడును ప్రదర్శిస్తోంది.

అయిదు. చైనా వస్తూత్పత్తిలో అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది. 2018 చివరి నాటికి ప్రపంచ వస్తూత్పత్తిలో 28 శాతాన్ని చైనానే ఉత్పత్తి చేసింది. అదే అమెరికా వాటా 16 శాతం మాత్రమే. అదే సమయంలో ప్రపంచ డీజీపీలో చైనా వాటా 17 శాతం మాత్రమే కాగా, అమెరికా 24 శాతాన్ని కలిగి ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారం 2024 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. చైనానుంచి తలెత్తుతున్న ఈ ప్రమాదాన్ని గ్రహించినందువల్లే దిగిపోనున్న అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు వ్యతిరేకంగా వాణిజ్య యుద్ధం మొదలెట్టారు. మొదట్లో ఇది అమెరికాకు అనుకూల ఫలితాలను తీసుకొచ్చింది కూడా. 2018లో చైనాతో 419 బిలియన్‌ డాలర్ల లోటు వాణిజ్యాన్ని కలిగిఉన్న అమెరికా 2019 నాటికి దానికి 345 బిలియన్‌ డాలర్లకు తగ్గించుకోగలిగింది. 2017లో ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటినుంచి 2019 చివరి నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 77 బిలియన్‌ డాలర్ల మేరకు తగ్గిపోయింది. అమెరికా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయకుండానే చైనాతో వాణిజ్యాన్ని పెంచుకోవడం జో బైడెన్‌కు పెనుసవాలుగా మారనుంది. ఈ పరిస్థితుల్లో జోబైడెన్‌ నేతృత్వంలో అమెరికా విదేశీ విధానం ట్రంప్‌ విధానాలకంటే పెద్దగా వ్యత్యాసంతో ఉండదని స్పష్టమెంది. బైడెన్‌ విధానాల్లో చైనానే కీలకమవుతుంది. భాగస్వామ్యాలు, పొత్తులపై అమెరికా మరింతగా నొక్కి చెప్పవచ్చు. భారత్‌కు అమెరికా అవసరం కంటే మించి అమెరికాకు భారత్‌ మరింత అవసరం అవుతుంది. ఎందుకంటే భారత్‌ మద్దతు లేకుండా చైనాను కట్టడి చేయడం అమెరికాకు సాధ్యపడదు.

వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్, రాజనీతి శాస్త్రం
సిక్కిం కేంద్రీయ విశ్వవిద్యాలయం
మొబైల్‌ : 79089 33741 
డాక్టర్‌ గద్దె ఓంప్రసాద్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top