ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే..?

Sakshi Spiritual Special Story

సత్కర్మలే ముక్తికి సోపానములు

"దుశ్చరిత్ర నుండి నేను బయట పడాలి. అమృతులను అనుసరించి ఉన్నతుడ నౌనుగాక। "అనునది యజుర్వేద మంత్రము. ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనేదిజీవుని తపన. అందువలన తాము ఉన్నతులు అవాలనే ఆకాంక్షతో ఋషులు పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నారు. ఒక వ్యక్తి ఉన్నతుడను కావాలని అభిలషిస్తే అతను స్పష్టమైన రెండు మార్గాలను అనుసరించాలి. ఒకటి, దుశ్చరిత్ర అంటే చెడునడవడి నుంచి బయట పడాలి. రెండు, అమృతులను అనుసరించాలి. అమృతులు అంటే నాశనం లేనివారు. సద్గుణాల చేత, సత్కర్మల చేతసత్కీర్తిని సాధించినవారు. అమృతులు అంటే ఉన్నతమైన నడతగలవారు. వారు అమరులు. అలాంటి వారు భౌతికంగా మన మధ్య లేకున్నా వారి గుణగణాలు మనకు స్ఫూర్తినిచ్చి మన నడవడికను తీర్చిదిద్ధుతాయి. అలాంటి వారు అవతార పురుషులు, కారణజన్ములు, సిద్ధులు, యోగులు, మహర్షులు మన సంస్కృతీ పరంపరలో ఎందరో ఉన్నారు.

అయితే కర్తవ్యా కర్తవ్య విచారణకు ఏది మూలం? ఆ విషయం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 10వ అధ్యాయం 24వ శ్లోకంలో ఇలా స్పష్టం చేసాడు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ। జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహార్హసి॥ కాబట్టి కర్తవ్యా కర్తవ్య నిర్ణయమునకు శ్రుతి స్మృతి పురాణ రూపమగు శాస్త్రమునే ఆశ్రయింపవలెను. స్వేచ్ఛారూపమున వ్యక్తమగు కామప్రేరణకు లొంగరాదు. కర్మ భూమియగు ఈ లోకమున ముముక్షువులు దేశకాలవర్ణా శ్రమోచితకర్మములను శాస్త్రవిధి అనుసరించే విధిని ఎరుక పరిచేరు. అవి తెలిసికొని ఆచరిచవలెను అరిషడ్వర్గాలను జయించకుండా ఉచ్ఛస్థితికి చేరడం సాధ్యం కాదు. అహం అనేది అహంకారం. అహంకారం ఉన్నవారు అసంఖ్యాకములైన ఆశలకులోనై కామక్రోధాలనాశ్రయించి, ఇంద్రియ భోగము కోసం చౌర్య వంచనాదులచే ధనమును కూడ బెట్ట చూతురు. దుశ్చరిత్ర కలవారు సంపదలను చూసుకుని తామే గొప్పవారమని భావించు కుంటారు. అది పతనావస్థకు దిగజారడానికి మొదటి మెట్టు. మనిషి మరణించిన తరువాత అతను సంపాదించిన దానిలో ఒక్క రాగి నాణెమైనా అతనితో రాదు. డాంబికమైన జీవన శైలే చాలామందిని అవినీతి కార్యకలాపాలకు పాల్పడడానికి ప్రేరేపిస్తుంది. అదే భావంతో వేమన అన్నది గమనించండి.

నీళ్ళలోని మీను నెరి మాంసమాశించి
గాలమందు చిక్కు కరణి భువిని
ఆశ తగిలి నరుడు నాలాగు చెడిపోవు
విశ్వధాభి రామ వినుర వేమన!

నీటిలోని చేప ఎరగా వేసిన మాంసపు ముక్క కోసం ఆశతో గాలానికి చిక్కుకుంటోంది. అదే విధంగా మానవుడు ఆశల గాలానికి చిక్కుకొని దానిలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ కష్టాల పాలవుతున్నాడని వేమన హెచ్చరించారు. మనిషి జీవితం మూన్నాళ్ళ ముచ్చట. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అందువలన పరమేశ్వరుని రూపంతో పాటు శ్మశానం కూడా మనస్సులో మెదులుతూ వుండాలి. కోరికలనేవి తీరేవి కావు. ఒకటి పొందుతే మరొకటి పుడుతుంది. ఈ వాంఛలకు అంతం ఉండదు. డబ్బు సంపదలు శ్వాశతమైనవి కావు. శ్రీ గుర్రం జాషువా గారు క్రింది పద్యంలో ఈ సత్యాన్ని ఎంత సరళంగా, సున్నితంగా చెప్పారో చూడండి.

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మనికలము 
నిప్పులలోన కరిగిపోయె ఇచ్చోటనే భూములేలు రాజన్యుల
యధికారముద్రిక లంతరించె
ఇచ్చోటనే లేత యిల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలసిపోయె
ఇచ్చోటనే యెట్టి పేరెన్నికగన్న చిత్రలేఖకుని కుంచెయు నశించె
యిది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె కదలించి యాడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టులొలయ
నవని పాలించు భస్మం సింహాసనంబు
అందువలన నాయీ జీవితం శ్వాశతమైనది కాదని, నేడోరేపో చావు తప్పదని తలపోసుకుంటూ బ్రతికి ఉన్నంత కాలం సత్కర్మలు చేయాలి. దానధర్మాలకు, పరోపకారానికి మించిన సత్కర్మలు లేవు అవే ముక్తి ప్రదాతలు.  - గుమ్మా ప్రసాద రావు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top