కత్తెర పురుగుకు కంచె పంటతో చెక్‌ 

Sagubadi Page Special Article ABout Agriculture - Sakshi

వ్యవసాయం అందరూ చేస్తారు ప్రయోగాలు చేసిన వాడే అధిక దిగుబడి సాధిస్తాడని తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడి జిల్లా వెల్లాలన్‌కొట్టాయ్‌ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ముత్తుపాండియన్‌(65) అంటున్నారు. పంటను రక్షించుకునేందుకు కంచె వేయడం పరిపాటి. ఒక పంటకు మరో పంటనే కంచెగా మార్చడం ద్వారా మొక్కజొన్న రైతులను వణికిస్తున్న కత్తెర పురుగును సైతం సమర్థవంతంగా అరికట్టి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడం ముత్తుపాండియన్‌ ప్రత్యేకత. ఈ సందర్బంగా ముత్తుపాండియన్‌ను ‘సాక్షి’ పలుకరించింది. 

వివరాలు ఆయన మాటల్లోనే.. మాది తరతరాలుగా వ్యవసాయ కుటుంబం. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఐదో తరగతిలోనే బడి మానేసి వ్యవసాయంలోకి దిగాను. గత ఏడాది అక్టోబరులో బీటీ పత్తి వేసినపుడు పురుగుల నుంచి పంటను కాపాడుకునేందుకు తొలిసారిగా ప్రయోగాత్మకంగా పొలం చుట్టూరా ఎర్రజొన్న పంటను నాలుగు సాళ్లు కంచె పంటగా వేశాను. ఒక ఎకరాకు పది కిలోల చొప్పున ఎర్ర జొన్న విత్తనాలు వేసాను. బీటీ పత్తి పంటను ఎర్ర జొన్న పంట రక్షణ కవచంగా నిలిచింది. ఈ రెండు పంటలూ ఏపుగా పెరిగి మంచి దిగుబడినిచ్చాయి. ఎకరానికి 32 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. 

ఈ ప్రయోగం సత్ఫలితాన్నివ్వడంతో ఈ ఏడాది మార్చిలో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న వేశాను. పొలం చుట్టూరా 30 కిలోల ఎర్ర జొన్నను నాలుగు సాళ్లలో వేశాను. మొక్కజొన్న కంటే ఎర్రజొన్న మొక్కలు ఎత్తుగా పెరిగాయి. దీని వల్ల కత్తెర పురుగు సహా ఏ పురుగులూ మొక్కజొన్న దరిచేరలేదు. పంట ఏపుగా పెరిగింది. వారం క్రితమే నూర్పిడి చేశారు. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వ్యవసాయ శాఖ కయతర్‌ బ్లాక్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగరాజ (99408 39014), కిల్లికులంలోని వ్యవసాయ కళాశాల–పరిశోధనా స్థానంలో కీటక శాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. రవి ఈ పంటను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎండాకాలపు మొక్కజొన్న పంటలో ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి తక్కువేమీ కాదన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటం వల్ల ఎకరానికి రూ. 6 వేల వరకు ముత్తుపాండియన్‌ను ఆదా అయ్యాయన్నారు. 

కంచె పంటగా వేసిన ఎర్రజొన్న పంటకు కూడా 8–10 శాతం మాత్రమే కత్తెర పురుగు వల్ల నష్టం జరిగింది.  మొక్కజొన్న కన్నా జొన్న 2 అడుగులు ఎత్తు పెరగటం వల్ల కత్తెర పురుగు బెడద తగ్గిందన్నారు. జొన్న చొప్ప పశువుల మేతగా, జొన్నలు దాణాగా వినియోగించుకోవడం వల్ల అదనపు లాభం కూడా దక్కుతుంది. 

రెండు మూడేళ్లుగా కత్తెర పురుగు మొక్కజొన్న పంటకు శాపంగా మారింది. 10–14 రోజుల జీవిత కాలంలో కత్తెర పురుగు 2 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పంటను తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగును అరికట్టడానికి ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వం రూ. 47 కోట్లు విడుదల చేసింది. గత ఏడాది కత్తెర పురుగుతో నష్టపోయిన రైతులకు రూ. 186 కోట్లు రైతులకు పరిహారంగా చెల్లించింది కూడా. ఈ నేపథ్యంలో ‘ముత్తుపాండియన్‌ మోడల్‌’లోనే మొక్కజొన్న రైతులందరూ చేను చుట్టూరా 4 సాళ్లు ఎర్రజొన్న వేసుకోవాలని ప్రభుత్వం ప్రచారోద్యమం చేపట్టడం విశేషం. 
దీనితోపాటు మొక్కజొన్న సాగుకు ముందు వేసవి దుక్కులు దున్ని, ఎకరానికి వంద కిలోల వేప పిండి వేయటం, విత్తన శుద్ధి చేయటం కూడా తప్పనిసరని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది. ముత్తుపాండియన్‌ ద గ్రేట్‌ అని అందరూ శ్లాఘిస్తున్నారు. ఆయన మొబైల్‌ : 94420 25059. 
– కోట్ర నందగోపాల్, సాక్షి, చెన్నై

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top