Anjali And Bindu: కట్నం వద్దు నాన్నా.. ఆ డబ్బు వాళ్ల కోసం ఖర్చు చేయండి

Rajasthan Bride Anjali Request Father Use Dowry Money 75 Lakhs Build Girls Hostel - Sakshi

అమ్మాయిల చదువే కానుక 

Rajasthan Bride Anjali And Karnataka Bride Bindu Inspirational Story: ‘మన ఒక్కరి వల్ల సమాజం బాగుపడుతుందా ఏంటి?’ అనే సందేహంతో చాలా మంది ముందడుగు వేయడానికి కూడా సాహసించరు. కానీ, బృందాలుగా సాధించలేని విజయాలు కూడా ఒక్కోసారి ఒక్కరు తీసుకున్న నిర్ణయంతోనే వేలమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఇటీవల ఒక్కరుగా అడుగు వేసి సమాజశ్రేయస్సుకు పాటుపడిన వారిలో రాజస్థాన్‌ వాసి అంజలి, కర్ణాటకలో ఉంటున్న బిందు మొదటి స్థానంలో నిలుస్తారు.

తన పెళ్లికి కట్నకానుకల కింద ఇచ్చే, పెళ్లి ఖర్చులకింద ఖర్చు చేసే డబ్బును బాలికల విద్యకోసం వారి హాస్టల్‌ నిర్మాణానికి ఇవ్వడంతో వార్తల్లో నిలిచింది. తమ ఊరు రోడ్డు బాగుచేస్తేనే పెళ్లిచేసుకుంటానని అధికారులు దిగివచ్చేలా చేసింది కర్ణాటకలో ఉంటున్న బిందు. ఈ ఇద్దరు యువతులు సమాజ శ్రేయస్సుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎంతోమందిని ఆలోచింపచేస్తోంది. 

అమ్మాయిల విద్యకు.. కట్నం డబ్బు
రాజస్థాన్‌లో ఉంటున్న అంజలికి ఈ నెల 21న మదన్‌సింగ్‌ రాంధాతో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి తండ్రి ఇచ్చే స్త్రీ ధనాన్ని బాలికా విద్యను ప్రోత్సహించడానికి అమ్మాయిల హాస్టల్‌ నిర్మాణానికి ఖర్చు చేయాలని కూతురు తండ్రిని కోరింది. సమాజం పట్ల కూతురిలో ఉన్న అవగాహనకు, ఆమె తీసుకున్న చొరవకు మద్దతు ఇస్తూ అంజలి తండ్రి బాలికా హాస్టల్‌కు అవసరమైన 75 లక్షల రూపాయల చెక్కును అందించాడు.

దీంతో పెళ్లికి వచ్చినవారంతా ఈ తండ్రీకూతుళ్లకు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. ‘కూతురుకు మంచి విద్యను అందించినప్పుడు ఆమె పుట్టింటిని, అత్తింటిని రెండు కుటుంబాల భవిష్యత్తును మెరుగుపరచగలదు. అలాంటి కుమార్తెలు మన అందరి కుటుంబాల్లో ఉంటే సమాజం భవిష్యత్తు కూడా మెరుగుపడుతుంది. అంజలి తన తండ్రి నుండి వివాహ వేడుక సందర్భంగా తీసుకున్న మొత్తాన్ని సమాజంలోని ఆడపిల్లల మంచి భవిష్యత్తు కోసం కేటాయించింది’ అని నెటిజన్లు ఈ తండ్రీ కూతుళ్లను ప్రశంసిస్తున్నారు. 

ఊరి రోడ్డు బాగయ్యాకే..
అంజలి లాగే కర్ణాటకలోని 26 ఏళ్ల బిందు ఆర్‌.డి తమ ఊరికి రోడ్డు వేయిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని భీష్మించుకుంది. సరైన రోడ్డు వసతి లేని కారణంగా తన చిన్నప్పటి నుంచి పడిన ఇబ్బందులు, విద్య–వైద్య సదుపాయాలు లేకపోవడం.. వంటివి చూస్తూ పెరిగిన బిందు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో నివసిస్తున్న బిందు ‘తమ గ్రామానికి రోడ్డు నిర్మించేవరకు తాను పెళ్లిచేసుకోనని గత సెప్టెంబర్‌ 9న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి ఇ–మెయిల్‌ చేసింది. ఆమె మెయిల్‌కు స్పందించిన అధికారులు ఆ ఊరి పరిస్థితిని పరిశీలించి, త్వరలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.

బిందు తమ ఊరి పరిస్థితి తెలియజేస్తూ –‘నేను పెళ్లి చేసుకొని మా ఊరును విడిచి వెళ్లిపోతే అక్కడ ఉండేవారిలో తమ హక్కుకోసం పోరాడే వారు ఎవరూ ఉండరు. రోడ్డు సరిగా లేకపోవడంతో వేరే ఊళ్లో ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు నేను 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఈ కారణంగానే ఎంతోమంది అమ్మాయిలు పాఠశాల స్థాయిలోనే చదువును మానేయాల్సి వచ్చింది. ఇప్పుడు మా ఊరికి ఏడు కిలోమీటర్ల దూరంలో మాయకొండ గ్రామంలో పాఠశాల, వైద్య వసతి ఉంది. అయితే, ఆ ఊరికి చేరుకోవాలంటే మా ఊరి రోడ్డు పూర్తి శిథిలావస్థలో ఉంది. ఈ కారణంగా ఏ వాహనం కూడా మా గ్రామానికి రావడం కానీ, వెళ్లడం కానీ జరగడం లేదు.

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సమయానికి నగరానికి తీసుకెళ్లలేకపోతున్నారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని బిందు ఆర్థికశాస్త్రంలో ఎం.ఎ. చేసింది. ‘మీ ఆలోచనకు వందనం. సమాజం బాగు కోసం మీరు తీసుకున్న చొరవకు అభినందనలు’ అంటూ బిందును ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. ఆడపిల్ల పెళ్లి అంటే పట్టుబట్టలు, బంగారం, అలంకరణ గురించే ఆలోచిస్తారు అనుకుంటారు. కానీ, ఊరి గురించి ఆలోచిస్తారు. సాటి అమ్మాయిల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.. అని తమని తాము కొత్తగా ఆవిష్కరించుకున్న ఈ నవతరం అమ్మాయిలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top