చరిత్రకు ప్రారంభం

India Women Cricket Team - Sakshi

క్రికెట్‌లో ప్రతిదీ రికార్డే. అయితే కానివ్వండి. భారత మహిళా క్రికెట్‌ చరిత్రే ఒక రికార్డు! ఆట లేనప్పుడే ఆడారు. ఆట మొదలైన ఏడాదికే.. పద్నాలుగు జట్లయ్యారు! వాళ్లను చూసి రైల్వే ఉద్యోగినులు. ఎయిర్‌ ఇండియా మహిళలు. మూడేళ్లలోనే..  ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌కి రెడీ! మహిళా క్రికెట్‌కు.. ఇది ప్రారంభ చరిత్ర కాదు. చరిత్రకు ప్రారంభం. 

మనదేశంలో 1932లో పురుషుల క్రికెట్‌ మొదలైంది. 1973లో మహిళలు క్రీజ్‌లోకి వచ్చారు. నలభై ఏళ్ల దూరం! మహేంద్ర కుమార్‌ శర్మ అనే జెంటిల్మన్‌ 1973లో సొసైటీస్‌ యాక్ట్స్‌ కింద లక్నోలో తొలిసారి ‘ఉమెన్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (డబ్లు్య.సి.ఎ.ఐ.) ను రిజిస్టర్‌ చేయించారు. బేగమ్‌ హమీదా హబీబుల్లా అధ్యక్షురాలు. శర్మ వ్యవస్థాపక కార్యదర్శి. అప్పటికింకా అధికారికంగా ఇండియాలో మహిళల క్రికెట్‌కు గుర్తింపు లేనప్పటికీ 1970 నుంచే దేశంలో క్రికెట్‌ ఆడుతున్న మహిళలు ఉన్నారు. వారి ఉత్సాహమే శర్మ చేత మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌ని రిజిస్టర్‌ చేయించింది. ఏడాదిలో తొమ్మిది నెలలు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలు క్రికెట్‌ బ్యాట్‌లు, కిట్‌లతో కనిపించేవారు. 

మూడు జట్లతో మొదలు
1973 ఏప్రిల్‌లో తొలి అంతర్రాష్ట్ర మహిళా క్రికెట్‌ జాతీయస్థాయి పోటీలు పుణెలో మొదలయ్యాయి. బాంబే, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ జట్ల మధ్య పోటీ జరిగింది. ఆ ఏడాది చివర్లో వారణాసిలో జాతీయస్థాయి పోటీలు జరిగే నాటికి మూడు జట్లు ఎనిమిది జట్లయ్యాయి. పోటీలు ముగియగానే క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాక కమిటీలో మార్పులు, చేర్పులు జరిగాయి. చైర్‌ పర్సన్‌గా శ్రీమతి చంద్రా త్రిపాఠీ, అధ్యక్షురాలిగా శ్రీమతి ప్రమీలాబాయి చవాన్‌ బాధ్యతలు స్వీకరించారు. వీళ్లిద్దరితో పాటు వ్యవస్థాపక కార్యదర్శి శర్మ దేశంలో మహిళల క్రికెట్‌ ప్రాథమిక పురోగతిలో ముఖ్యపాత్రను పోషించారు. మూడో చాంపియన్‌షిప్‌ పోటీలు కలకత్తాలో జరిగాయి. జట్లు కూడా ఎనిమిది నుంచి పద్నాలుగుకు పెరిగాయి! నాటి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలూ మహిళల క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించడం మొదలైంది.

తర్వాత వేర్వేరుగా రైల్వేస్, ఎయిర్‌ ఇండియా మహిళా ఉద్యోగుల క్రికెట్‌ జట్లు ఆవిర్భవించాయి. 1974లో కాన్పూర్‌ (యు.పి.) లో రాణీ ఝాన్సీ ట్రోఫీ పేరుతో పరిమిత ఓవర్‌ల ఇంటర్‌–జోనల్‌ మహిళా క్రికెట్‌ పోటీలు జరిగాయి. అదే ఏడాది రాజ్‌కోట్‌ (గుజరాత్‌) లో ఇంటర్‌–యూనివర్సిటీ టోర్నమెంట్‌ జరిగింది. స»Œ  జూనియర్‌ (అండర్‌ 15), జూనియర్‌ (అండర్‌ 19) టోర్నమెంట్‌లు కూడా. ఒక్కో జోన్‌ నుంచి విజేతలైన వారు ఇందిరా ప్రియదర్శిని ట్రోఫీ కోసం పోటీ పడేవారు. నేషనల్స్‌లో గెలిచినవారు ‘రావూస్‌’ కప్పు కోసం రెస్టాఫ్‌ ఇండియా జట్టుతో తలపడేవారు. 

ప్రధాని ఇందిరాగాంధితో భారత మహిళా క్రికెట్‌ జట్టు (1975)

మనవాళ్లవి ట్రౌజర్స్‌
మూడేళ్లు దేశం లోపలే జట్లు జట్లుగా ఆడాక.. భారత మహిళా జట్టు తొలిసారి 1975లో రెండు దేశాల క్రికెట్‌ సీరీస్‌ను ఆస్ట్రేలియా (అండర్‌ 25) జట్టుతో స్వదేశంలో ఆడింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సీరీస్‌ అవి. పుణె, ఢిల్లీ, కలకత్తాలో జరిగాయి. ఆసక్తికరమైన సంగతి ఏంటంటే మూడు టెస్టులకు మన మహిళా జట్టుకు ముగ్గురు కెప్టెన్‌లు! ఉజ్వలా నికమ్, సుధా షా, శ్రీరూపాబోస్‌. ఆస్ట్రేలియా సీరీస్‌ తర్వాత ఇండియా.. న్యూజిలాండ్, ఇంగ్లంyŠ , వెస్టీండీస్‌లతో ఇంటా, బయటా కూడా ఆడింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ దేశాల మహిళా జట్లు స్కర్ట్‌లు వేసుకుని ఆడితే, భారత మహిళా జట్టు ప్లేయర్‌లు ప్యాంట్స్‌ వేసుకుని ఆడారు. మన మహిళల సీనియర్‌ జట్టు ఆడిన మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ వెస్టిండీస్‌తో 1976 అక్టోబర్‌ 31న బెంగళూరులో. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అది ఆరు మ్యాచ్‌ల టెస్ట్‌ సీరీస్‌. రెండు జట్లూ సమానంగా గెలిచాయి.

అప్పట్లో మహిళల టెస్ట్‌ మ్యాచ్‌ మూడు రోజుల ఈవెంట్‌ మాత్రమే. రెండేళ్ల తర్వాత 1978లో ఉమెన్‌ ఇన్‌ బ్లూ (భారత మహిళా జట్టు) వరల్డ్‌ కప్‌ వన్‌డే ఇంటర్నేషనల్‌లో పాల్గొంది. ఇండియాలో జరిగిన ఆ వరల్డ్‌ కప్‌లో నాలుగు జట్లు పాల్గొన్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌. దురదృష్టవశాత్తూ ఇండియా జట్టు తను ఆడిన మూడు మ్యాచ్‌లూ కోల్పోయింది. కెప్టెన్‌.. డయానా ఎడెల్జీ. ఆ ఏడాదే ‘ఉమెన్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ గుర్తింపును అధికారికంగా పొందింది. ఆ తర్వాత సుదీర్ఘకాలానికి, పదిహేడేళ్ల తర్వాత భారత జట్టు వన్‌డే ఇంటర్నేషనల్‌ సీరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. 1995లో జరిగిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు శతాబ్ది ఉత్సవాల మ్యాచ్‌ అది. ఆ మ్యాచ్‌లో విజయం భారతజట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.  

శాంత.. సుధ.. సంధ్య
శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ, సుధా షా, సంధ్యా అగర్వాల్‌ మన తొలినాళ్ల మహిళా క్రికెట్‌ జట్టులోని కొందరు సూపర్‌స్టార్‌లు. ఆ నలుగురికి కూడా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు ప్రదానం చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళ శాంత. ఒక ఇన్నింగ్స్‌లో 190 రన్స్‌ తీసి సంధ్యా అగర్వాల్‌  ప్రపంచ రికార్డు సాధించారు. 1986లో ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ అది. బౌలర్‌ నీతూ డేవిడ్‌ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో (1995–96) 53 రన్స్‌కి 8 వికెట్‌లు తీసుకున్నారు. అదొక రికార్డు. ఇది మాత్రమే మొత్తం భారత మహిళా క్రికెట్‌ జట్టు చరిత్రకాదు. ప్రారంభ చరిత్ర మాత్రమే. తర్వాత్తర్వాత మన మహిళా క్రికెటర్‌లు ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. 1978 వరల్డ్‌ కప్‌లో మూడు మ్యాచ్‌లలోనూ పోరాడి ఓడిన నాటి నుంచి 2005, 2017లో ఫైనల్స్‌కి చేరేవరకు, 1970లలో గుప్పెడు మందే ఉన్న మహిళా క్రికెట్‌ ప్రేక్షకులు నేటికి లక్షకు చేరే వరకు భారత మహిళా జట్టు పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉంది. ఇప్పుడు ఐపీఎల్‌ ట్వంటీ20 అనే ఒక మహా పోరాటానికి సిద్ధమయింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top