Hair Fall Control Tips: వంటింట్లో దొరికే కొన్ని పదార్ధాలతో జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు!

How To Stop Hair Fall And Tips For Hair Growth In Telugu - Sakshi

ఈ రోజుల్లో జుట్టు రాలని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. యువకుల నుంచి పెద్దవారి దాకా తమ జుట్టు ఊడిపోతుందని బాధపడే వారు కోకొల్లలు. తీరిక లేని పనులు, దీర్ఘకాలిక సమస్యలు, వర్క్‌టెన్షన్లు, ఉరుకుల పరుగుల జీవితంలోసరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలతో జుట్టు ఊడిపోతుంది. మరోవైపు వెంట్రుకలు రాలిపోతున్నాయన్న భయం, ఒత్తిడి కూడా వెంట్రుకలు మరింత పలచబడేందుకు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో తల పలచబడుతుంది, బట్టతల వస్తుంది పెళ్లికాదేమోనని ఒకటే హైరానా కనిపిస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు, ఆయుర్వేద మూలికలు వాడతారు.

ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్‌మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. పెరుగుతున్న జనాభాతోపాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుండడంతో రోజురోజుకి వాతావరణ పరిస్థితులు మానవాళి మనుగడను శాసిస్తున్నాయి. అడ్డు అదుపు లేని జీవన శైలి కూడా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా దైనందిన ఆహారంలో తీసుకునే పోషకాల కొరత, వివిధ రకాల సమస్యల వల్ల కలిగే ఒత్తిడితోపాటు, వాయుకాలుష్యం జుట్టు రాలడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యలను అధిగమించవచ్చు.

సాధారణంగా వెంట్రుకల జీవిత కాలంలో యనజెన్, కెటాజెన్, టెలోజెన్‌  అనే మూడు  దశలు ఉంటాయి. యనాజెన్‌  దశలో కేశాలు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతాయి. ఈ దశనుంచి కెటాజెన్‌  దశలోకి వెళ్లేటప్పటికి కేశాల పెరుగుదల ఆగిపోతుంది. మూడో దశను టెలోజెన్‌  లేదా విశ్రాంతి దశ అంటారు. ఈ దశలో కేశాలు విశ్రాంత స్థితికి చేరుకుని కుదళ్ల నుంచి ఊడిపోతాయి. అందరిలో  ఈ దశలన్నీ  ఒకేలా ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం చిన్నవయసులోనే జుట్టు తెల్లబడడం, మరికొందరిలో విపరీతంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి.

ఈ విధంగా జరగడానికి వారసత్వ జన్యువులు ఒక కారణమైతే, ఒత్తిడి హర్మోన్ల అసమతుల్యత, ఆటోఇమ్యూన్‌  డిసీజ్‌(ఎస్‌ఎల్‌ఈ), సిఫలీస్, పోషకాల కొరత, వాతావరణ ప్రతికూలతలు, కొన్ని రకాల ఔషధాల వల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది. ఆటో ఇమ్యూన్‌  వ్యాధి కారణంగా... శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఆరోగ్యంగా ఉన్న అవయవాలపై దాడి చేసి కణాలను నాశనం చేస్తుంది. తద్వారా కూడా జుట్టు ఊడిపోతుంది. ఇలా రాలుతున్న కేశాలను నియంత్రించడం కొంచం కష్టమే అయినప్పటికి... వంటింట్లో దొరికే కొన్ని పదార్ధాలతో జుట్టు రాలడాన్ని ఆపడంతోపాటు, పెరిగేటట్టు కూడా చేసుకోవచ్చు. 

ఉసిరి..
ఇండియన్‌ గూస్‌బెర్రీగా పిలిచే ఉసిరిలో జుట్టుకు బలం చేకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధికమొత్తంలో విటమిన్‌  ఇ , విటమిన్‌  ఉ, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి.ఇవి కేశాలను బలంగా దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి. ఇక మాడు(స్కాల్ప్‌)పై వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ లను ఎదుర్కొనేందుకు విటమిన్‌  ఇ తోడ్పడుతుంది. అందువల్ల ఉసిరిని తినడం లేదా జ్యూస్‌ చేసుకుని తాగడం, నేరుగా స్కాల్ప్‌పై రాసుకోవడం వంటివి చేయాలి. ఉసిరికాయను ముక్కలుగా కోసి నీడలో ఆరబెట్టాలి. ముక్కలు ఆరిన తరువాత పొడిచేసుకోవాలి. ఇప్పుడు ఉసిరి పొడి 2 టేబుల్‌ స్పూ¯Œ ్స తీసుకుని దానిలో నిమ్మరసం వేసుకుని పేస్ట్‌లా చేసుకుని స్కాల్ప్‌పై అఫ్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకుని రెండు గంటల పాటు ఉంచుకుని ఆ తరువాత షాంపు, చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్లు రాలడం తగ్గి పెరుగుదల కనిపిస్తుంది.

క్యారెట్‌
సరదాగా తినే క్యారెట్‌ ద్వారా అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్‌ ఎ, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడమేగాక, వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. క్యారెట్‌ జ్యూస్‌ బాలనెరుపు రాకుండా చేస్తుంది. అందువల్ల 100 మిల్లీ లీటర్ల క్యారెట్‌ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా, నల్లగా పెరుగుతాయి.

అలోవెరా
ప్రతి ఇంటిలోనూ దాదాపుగా అలోవెరా మొక్క ఉంటుంది. సౌందర్య పోషణకు, కేశ సంరక్షణకు దీనిని బాగా ఉపయోగిస్తారు. అలోవెరా ఇ సఫ్లమేటరీ స్కిన్‌  కండీషన్‌ను నివారించడంలో తోడ్పడుతుంది. స్కాల్ప్‌ నుంచి విడుదలయ్యే కొన్ని రకాల స్రావాలు కుదుళ్లను బలహీన పరుస్తాయి. ఫలితంగా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అలోవెరా వాడడం వల్ల శ్లేషస్రావాల ఉత్పత్తి తగ్గి, కుదుళ్లు ఆరోగ్యంగా ఉండి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. అలోవెరాలోని జెల్‌ లాంటి పదార్ధాన్ని స్కాల్ప్‌పై మర్దనా చేసి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీళ్లతో కడగాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

స్వచ్ఛమైన కొబ్బరి నూనె
కల్తీలేని స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఉండే లారిక్‌ యాసిడ్‌ మూలకేశాల నుంచి వెంట్రుకల ప్రోటిన్‌  విడిపోకుండా ఉండేందుకు గట్టిగా బంధించి ఉంచుతుంది. అంతేకాకుండా వెంట్రుకలు తెగిపోకుండా కుదుళ్ల నుంచి బలంగా ఉంచుతుంది. కొబ్బరినూనెతో తలమీద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ల నుంచి కేశాలు పెరుగుతాయి. అంతేకాకుండా 15–20 నిమిషాలపాటు కొబ్బరినూనెతో స్కాల్ప్‌ మర్దన చేసి ఒక గంటపాటు లేదా ఒక రాత్రి మొత్తం అలా వదిలేయాలి. ఆతరువాత షాంపుతో తల కడుక్కుంటే జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

గుడ్లు
గుడ్లలో ఉండే ప్రోటిన్స్‌, విటమిన్‌  బీ12, ఐరన్, జింక్, ఒమేగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌ వెంట్రుకల పెరుగుదలను పెంచుతాయి. అంతేగాకుండా ఒత్తుగా ఉంచేందుకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. ఒక గుడ్డు సొనను ఒక గిన్నెలో తీసుకుని దానిలో టేబుల్‌ స్పూన్‌  కొబ్బరినూనెను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు, మాడుకు రాసి 30 నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఆ తరువాత షాంపు రాసి చల్లని నీటితో కడగాలి. ఈ మిశ్రమాన్ని తలకు పెట్టుకున్నప్పుడు చల్లటి నీటితోనే కడగాలి, వేడినీటిని అస్సలు వాడకూడదు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా నిగనిగలాడుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top