Know About What Is Bathing And Its Types In Telugu, How Can Take Bath Without Water - Sakshi
Sakshi News home page

స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు.. నీరు లేకుండా స్నానం చేయొచ్చని తెలుసా!

Published Sat, Jun 24 2023 12:08 PM

Did You Know What Is Bathing And Its Types Can Take Bath Without Water - Sakshi

స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. అదే తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తే మసాజ్‌లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. గులాబీ రేకుల స్నానం చేస్తే చర్మానికి లాలన దొరుకుతుంది. అరోమ స్నానం చేస్తే ఒక క్రొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది. ఇలా పలు విధాలుగా అనిపిస్తుంది. అసలు స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి తెలుసుకుందామా!.

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి రెండు అవి 1.జలము, 2.అగ్ని. అగ్ని దాహక శక్తి. అది మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అనేది శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. మన హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. నిజానికి
స్నానాలని అయిదు విధాలుగా చెప్పినప్పటికీ చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చు. ఇక స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధములు. అవి నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, కామ్య స్నానం

నిత్య స్నానం: ప్రతీరోజూ చేసే స్నానమే నిత్య స్నానం.
నైమిత్తిక స్నానం: ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. ఉదా : గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్నతర్వాత, చెడ్డ కలలు కన్న తర్వాత, సంసార సుఖం అనుభవించిన తర్వాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం. అలాగే ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికం.
కామ్య స్నానం: ఒక కోరికతో చేసేది కామ్య స్నానం. ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక, మాఘ ఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.

ఇక స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు. అవి ముఖ్య స్నానం, మంత్రం లేదా బ్రాహ్మ్యం
ముఖ్య స్నానం: ఇది నీటిని ఉపయోగించి చేసేది.
మంత్రం లేదా బ్రాహ్మ్యం: వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం". మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం. అలాగే పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.

నీరు లేకుండా కూడా స్నానం చేయొచ్చు:
నీరు లేకుండా చేసే స్నానాన్నే అముఖ్యం లేదా గౌణ స్నానం అంటారు. మీరు చదివినది నిజమే! నీరు లేకుండా కూడా స్నానం చేయచ్చు. ఇవి అయిదు రకాలు. వాటిలో..
ఆగ్నేయస్నానం: హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. అదెక్కడి స్నానం అనుకుంటున్నారా?.. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే. అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినది బూడిదే. అందుకే బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.

విభూతి ధరించేటప్పడూ పటించే శ్లోకం అర్థం ఏంటో చూస్తే...పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అని భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. ఇది స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక దీన్ని నిర్మలత్వానికి సంకేతంగా చెబుతారు. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తారు.

భౌమస్నానం: పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే mud bath అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే.. చెట్టు చేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం ధరించాలనేది శాస్త్రం కూడా. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.

ఆధ్యాత్మిక స్నానము
వాయవ్యస్నానం: ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.

దివ్యస్నానం: లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది. అవకాశం వస్తే వదలకండి.

మానసిక స్నానం: అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది.

అలాగే ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చే మరికొన్ని స్నానాలు..
👉: నేతితో స్నానం చేయుట వలన ఆయుర్దాయం పెరుగుతుంది
👉: పెరుగు, ఆవుపేడతో స్నానం చేయుట వలన లక్ష్మీ వర్ధనము
👉: దర్భలతో చేయుట వలన సర్వ పాపాలు తొలగుతాయి
👉: సర్వ గంధాలతోటి స్నానం చేస్తే సౌభాగ్యము, ఆరోగ్యము అభివృద్ది చెందుతాయి.
👉: ఆమలక స్నానము అంటే ఉసిరికాయని వేసి చేసిన స్నానం వలన దారిద్ర్యాలు తొలగుతాయి
👉: నువ్వులు,  తెల్ల ఆవాలతో చేసిన స్నానం అమంగళనివారకము. నువ్వులతో కాని తెల్ల ఆవాలతో కాని ప్రియంగువుతో కాని స్నానం చేస్తే సౌభాగ్యం .
👉: వర్ధనము, మోదుగ, మారేడాకులు, రెల్లు, తామర, కలువ, కడిమి పువ్వులతో స్నానం చేస్తే లక్ష్మీ వర్ధనమే కాక శుభప్రదం;
👉: నవరత్నాలతో స్నానము చేస్తే యుద్ధ విజయం.
👉: బంగారము వేసిన నీటితో స్నానం చేస్తే ఆయుష్షు, మేధా శక్తి పెరుగుతాయి.
(చదవండి: ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో? దశరథుని మాటల్లో..)

Advertisement
Advertisement