బాడీ బిల్డింగ్‌ కోసం..ఏకంగా 39 నాణేలు, 37 అయస్కాంతాలు..!

Delhi Man Swallows 39 Coins 37 Magnets For Body Building - Sakshi

కొందరూ భలే విచిత్రంగా ఉంటారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది అంటే ఏమాత్రం ఆలోచించకుండా అనాలోచితంగా పాటించేస్తుంటారు. ఆ తర్వాత శరీరానికి పడక నానా అవస్థలు పడుతుంటారు. అలానే ఇక్కడొక వ్యక్తి జింక్‌ ఆరోగ్యానికి మంచిది, పైగా బాడీ బిల్డింగ్‌కి బాగా ఉపయోగపడుతుందని చెప్పారని మూర్ఖంగా ఓ పిచ్చిపని చేశాడు. అతడు చేసిన ఆ ఘనకార్యం కారణంగా ఆస్పత్రి పాలై సర్జరీ చేయించుకునే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. అతడు చేసిన పని వింటే వీడేం మనిషి రా బాబు! అని నోరెళ్లబెడతారు.!

ఏం చేశాడంటే..ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల వ్యక్తి గత 20 రోజులకు పైగా పదే పదే వాంతులు, కడుపు నొప్పితో విలవిలలాడాడు. దీంతో కుటుంబసభ్యులు ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రికి హుటాహుటినా అతడిని తీసుకు వచ్చారు. అతడి పరిస్థితి చూసి వైద్యులు తక్షణమే  ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అతడు మానసిక వైద్యం తీసుకుంటున్నాడని, పైగా గత కొన్ని రోజులుగా నాణేలు, అయస్కాంతాలు మింగుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో అతని పొత్తి కడుపుని సిటీ స్కాన్‌ చేయగా నాణేలు, అయస్కాంతాలు భారీ మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. ఇవి ప్రేగులకు అడ్డు పడటంతో రోగికి ఇబ్బందికరంగా మారిందని వైద్యులు తెలిపారు.

వెంటనే ఆ వ్యక్తికి సర్జరీ చేయగా.. చిన్న ప్రేగుల్లో అయస్కాంతాలు, నాణేలు రెండు వేర్వేరు లూప్‌లో ఉన్నాయన్నారు. దీంతో పేగులను కూడా తెరిచి అయస్కాంతాలను బయటకు తీసినట్లు తెలిపారు. అయితే నాణేలు అయస్కాంతానికి అంటుకుపోవడంతో తీయడం క్లిష్టమయ్యిందన్నారు. ఇలా అతడి కడుపు నుంచి మొత్తం 39 నాణేలు(రూ. 1,2,5 నాణేలు), 32 అయస్కాంతాలు (గుండ్రని, త్రిభుజం, బుల్లెట్‌ ఆకారం) వెలికి తీసినట్లు వెల్లడించారు.

శస్త్ర చికిత్స అనంతర కూడా రోగికి ఎక్స్‌ రే తీశామని, ఎలాంటి వస్తువులు లేవని పేర్కొన్నారు. అలాగే రోగి పూర్తి స్థాయిలో కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇంతకీ ఆ వ్యక్తి వీటిని జింక్‌ కోసం అని మింగాడట. జింక్‌ విటమిన్‌ బాడీ బిల్డింగ్‌కి ఉపయోగపడుతుందని ఇలా చేశాడట. ఇది విని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. దయచేసి ఇలా ఆరోగ్యానికి మంచిదని ఏదీ పడితే అది అనాలోచితంగా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అన్నారు. 

(చదవండి: వింత పెళ్లి..వధూవరులెవరో తెలిస్తే కంగుతింటారు!
 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top