ముంగిట్లో వ్యాక్సిన్లు... సందేహాలూ-సమాధానాలు

Coronavirus Vaccine: What You Need To Know About Vaccine Safety - Sakshi

ప్రపంచాన్ని వణికించిన కరోనాకు వ్యాక్సిన్లు త్వరలోనే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాము త్వరలోనే అందుతామంటూ ఫైజర్, ఆక్స్‌ఫర్డ్, స్ఫుట్నిక్, కోవాక్సిన్‌ వంటి వ్యాక్సిన్‌లు ఊరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల్లో వీటిపై కొన్ని సందేహలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల కో–వ్యాక్సిన్‌ డోస్‌ తీసుకున్నప్పటికీ హార్యానాకు చెందిన ఓ మంత్రికి కరోనా సోకిందనీ, దాంతో వ్యాక్సిన్‌ తీసుకుంటే దానివల్లనే కరోనా వచ్చే ప్రమాదం ఉంటుందా అని కొందరి సందేహం. వ్యాక్సిన్‌ ప్రభావం ఒకవేళ 70 శాతమే ఉన్నప్పుడు... మిగతా 30 శాతం మందిలో అది పనిచేయనప్పుడు దాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటూ మరికొందరి సంశయం. వ్యాక్సిన్లపై ఇలాంటి సందేహాలెన్నో! ప్రజల్లో ముప్పిరిగొంటున్న ఈ ప్రశ్నలకు సమాధానాలతో వారి అపోహలను దూరం చేసేందుకు నిపుణులు చెబుతున్న మాటలూ... ప్రజల్లో వారు నింపుతున్న  భరోసాలేమిటో చూద్దాం. 

1. ఇటీవలే హర్యానా హోంమంత్రి ‘అనిల్‌ విజ్‌’కి కోవిడ్‌ 19 ఇన్ఫెక్షన్‌ రావడం తో వ్యాక్సిన్ల పనితీరుపై సామాన్య ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇన్ఫెక్షన్‌ సోకడానికి రెండు వారాల ముందే ఆయన ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడంతో అది ఆయన తీసుకున్న వ్యాక్సిన్‌లోని వైరస్‌ వల్ల వచ్చిందా... లేక అది సరిగా పనిచేయనందున కోవిడ్‌ సోకిందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలకు సమాధానాలేమిటి?

జ: వ్యాక్సిన్‌ తీసుకోవడంతో అందులోని వైరస్‌ కారణంగా ఇన్ఫెక్షన్‌ వచ్చిందనడం సరికాదు. వ్యాక్సిన్లలో అనేక రకాలు ఉంటాయి. కో–వ్యాక్సిన్‌లో ఉన్న రకాన్ని  ‘ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌’ అంటారు. అంటే ఒక వైరస్‌లోని జీవపదార్థాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాక ఆ వ్యాక్సిన్‌ తయారు చేస్తారు. ఇలా పూర్తిగా నిర్వీర్యం చేశాక అది దేహంలోకి ప్రవేశించి కేవలం యాంటీబాడీస్‌ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది తప్ప... వ్యాధి సోకేలా చేసేంత క్రియాశీలంగా ఉండదు. అందుకే వ్యాక్సిన్‌ కారణంగానే వ్యాధి వచ్చిందనీ లేదా వస్తుందేమో అని సందేహపడటం కేవలం ఓ అపోహ మాత్రమే. అందువల్ల... వ్యాక్సిన్‌ వల్ల  వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం దాదాపుగా లేనట్టే. 

2. మరి ఆయన వ్యాక్సిన్‌ తీసుకున్నా సరే కరోనా  సోకింది కదా. అలా మిగతావారికి కూడా సోకే అవకాశం ఉంది కదా?

జ: హర్యానా హోం మంత్రి అనిల్‌ విజ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న 14 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్‌ కనిపించింది. ఇది వ్యాక్సిన్‌లో ఉండే నిర్వీర్యమైన వైరస్‌ వల్ల వచ్చిందనుకోడానికి వీల్లేదని ఇప్పటికే చెప్పుకున్నాం. ఇక వ్యాక్సిన్‌ పని చేయకపోవడం వల్ల వచ్చిందని కూడా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌ అనేది పనిచేస్తుందా లేదా అని తెలుసుకునేందుకు 42 రోజుల వ్యవధి అవసరం. 
అంటే... ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఇలా వ్యాక్సిన్‌ వేసుకోగానే అలా ఇమీడియట్‌గా ప్రొటెక్షన్‌ రాదు. తొలి మోతాదు వ్యాక్సిన్‌ వేసిన నాలుగు వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. అంటే... మొదటి డోస్‌ వేశాక 28 రోజుల తర్వాత మరోసారి మరో డోస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి 28 రోజులూ... ఆ తర్వాతవి 14 రోజులు కలుపుకుని మొత్తం 42 రోజుల తర్వాతే వ్యాక్సిన్‌ ప్రభావం దేహంలో కనిపిస్తుందన్నమాట. 

3. వ్యాక్సిన్‌ తీసుకున్నవారందరికీ కరోనా నుంచి పూర్తి రక్షణ సమకూరుతుందా? వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ రాదా? 

జ: వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని చెప్పలేం. ఉదాహరణకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల తర్వాత 95 శాతం రక్షణ ఇస్తుందని ఆ కంపెనీ వారు చెబుతున్నారు. అలాగే మన దేశంలోని కో–వ్యాక్సిన్‌ నుంచి 70 శాతం రక్షణ కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీన్నిబట్టి వ్యాక్సిన్‌ వేసిన వాళ్లలో కరోనా అస్సలు రాకుండా ఉండాలనే నియమం ఏమీ లేదు. కొంతమందిలో వ్యాక్సిన్‌ వేసిన తర్వాతా ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. సుమారు 95% ప్రొటెక్షన్‌ ఉంది అంటే వందలో ఐదుగురికి ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది. అలాగే 70 శాతం మందికి రక్షణ కలుగుతుందంటే 30 శాతం మందిలో దాని ప్రభావం ఉండనట్టే కదా. 

4. మరి పైన చెబుతున్నట్లుగా వ్యాక్సిన్‌ వల్ల 100 శాతం ప్రొటెక్షన్‌ లేకపోతే ఎందుకు తీసుకోవాలి? దాన్ని తీసుకున్న తర్వాత కూడా ఎలాగూ కొంతమందికి రక్షణ కలగడం లేదు కదా? 

జ: ఈ ప్రపంచంలో తయారైన ఏ వ్యాక్సిన్‌ కూడా నూటికి నూరు పాళ్లూ రక్షణ ఇవ్వదు. ఏదైనా వ్యాక్సిన్‌ సుమారుగా 50 శాతం పైన ప్రొటెక్షన్‌ ఇస్తుందంటే... ఆ వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిదే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అమెరికన్‌ ఎఫ్‌డీఏ చెప్తున్నాయి.  ఎందుకంటే 50 శాతం పైగా ప్రభావపూర్వకంగా పనిచేస్తుందంటే సగానికి పైగా ప్రజలను కాపాడుకున్నట్లే కదా.  

5. ఇప్పటికే కరోనా వైరస్‌ వచ్చి తగ్గిపోయిన వారిలో యాంటీబాడీస్‌ ఉంటాయి కదా. మరి వారు మళ్లీ వ్యాక్సిన్‌ తీసుకోవాలా? 

జ: ఇప్పటికే కరోనా వైరస్‌ వచ్చి తగ్గిపోయిన వారి దేహంలో ఎలాగూ యాంటీబాడీస్‌ ఉంటాయి. కాబట్టి వాళ్లు మళ్లీ వ్యాక్సిన్‌ తీసుకోవాలా లేదా అని ప్రశ్నలు తలెత్తడం సహజమే. అయితే ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు యాంటీబాడీస్‌ ఇంకా ఎక్కువ మోతాదులో వచ్చే అవకాశం ఉంటుంది.ఇప్పటివరకు జరిగిన ఫేస్‌–3 పరిశోధనల్లో... ఇప్పటికే వారిదేహంలో యాంటీబాడీస్‌ తయారై ఉన్న వాళ్లు కూడా కొంతమంది ఉన్నారు. అయితే వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చినప్పుడు వారిలో ఎలాంటి దుష్ప్రభావాలూ తలెత్తలేదు. కాబట్టి వీళ్ళకి మళ్లీ వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయం పైన ఇప్పటివరకు అంతగా స్పష్టత లేదు.

అయితే... ఎందుకైనా మంచిదంటూ వ్యాక్సిన్‌ తీసుకోవడంలో తప్పు కూడా లేదు. ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత... వారి దేహాల్లో యాంటీబాడీస్‌ సరైన మోతాదులో ఉంటే గనక వారు వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ... ఈ యాంటీబాడీస్‌ సరైన మోతాదులో లేని వాళ్లు మాత్రం యధావిధిగా వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.కరోనా ఇన్ఫెక్షన్‌ వచ్చిన తర్వాత స్వాభావికంగా (నేచురల్‌గా) దేహంలో ఉద్భవించిన యాంటీబాడీస్‌ ఎంతకాలం ఉంటాయి అన్న విషయం ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. చాలా మందికి యాంటీబాడీస్‌ తొందరగా తగ్గిపోవడంతో ఒకసారి నేచురల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చిన తర్వాత కూడా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం పడే అవకాశం ఎక్కువగానే ఉంది. 

6. కరోనాకి వ్యాక్సిన్‌  వచ్చింది కాబట్టి  ఈ వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసినట్లేనా? 

జ: ఈ విషయాన్ని ఇప్పుడే ధ్రువీకరించడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పటివరకూ నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్లు తమ ప్రభావాన్ని బాగా ప్రదర్శించినప్పటికీ నిజజీవితంలో వ్యాక్సిన్‌ ప్రభావాలు ఎలా ఉంటాయి, ఏ మేరకు ఉంటాయి అన్న అంశాలను ఇప్పటికి కూడా మనం అంచనా వేయడానికి వీలు చిక్కలేదు. ఎందుకంటే క్లినికల్‌ ట్రయల్స్‌లో పరీక్షలన్నీ అన్ని రకాలుగా నియంత్రిత వాతావరణలో (కంట్రోల్డ్‌ ఎన్విరాన్మెంట్‌) జరుగుతాయి. కానీ నిజజీవితంలో కోల్డ్‌ చైన్‌ మెయింటైన్‌ అవుతుందా లేదా అనే విషయం పైన వ్యాక్సిన్‌ ప్రభావం ఆధారపడి ఉంటుంది. అంటే తయారైన వ్యాక్సిన్‌ను నిర్ణీతంగా ఒక ఖచ్చితమైన ఉష్ణోగ్రత వద్ద  ఉంచాలి.

అలా ఉంచే వేయాల్సిన చోటికి తరలించాలి. ఆ నియంత్రిత ఉష్ణోగ్రతలో ఉంచి వ్యాక్సిన్‌ను దాన్ని ఉపయోగించాల్సిన పల్లెప్రాంతాలకు తరలించేవరకు అదే వాతావరణాన్ని మెయిన్‌టెయిన్‌ చేయడాన్ని కోల్డ్‌చైన్‌ అంటారు. కేవలం ఇది మాత్రమే కాకుండా ఒకసారి వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దాని వల్ల వచ్చిన యాంటీబాడీస్‌ బాడీలో ఎంతకాలం ఉంటాయన్న విషయం పైన కూడా ఈ వ్యాక్సిన్‌ ప్రభావం ఆధారపడి ఉంటుంది.రానున్న కాలంలో కరోనా వైరస్‌లో ఏవైనా కొత్త ముటేషన్స్‌ తలెత్తినప్పుడు కూడా ఈ వ్యాక్సిన్‌ అంతే ప్రభావపూర్వకంగా పనిచేయకపోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ వైరస్‌ ఇప్పటివరకు జన్యుపరంగా నిలకడగానే ఉంది. కాబట్టి వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top