హెల్త్‌ మాట 'వింటరు' కదా..? | ​health tips: These Health Issues You Might Face This Winter | Sakshi
Sakshi News home page

హెల్త్‌ మాట 'వింటరు' కదా..?

Dec 2 2025 11:39 AM | Updated on Dec 2 2025 11:39 AM

​health tips: These Health Issues You Might Face This Winter

చలికాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలు సాధారణంగా కాస్తంత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఈ సీజన్‌లో కీళ్లకు సంబంధించిన నొప్పులు పెరుగుతుంటాయి. కండరాల నొప్పులు కనిపిస్తుంటాయి. ఇక ఒళ్లంతా పగుళ్లతో, ముఖం, పెదవులూ, మడమలపై పగుళ్లు కనిపిస్తూ బాధిస్తుంటాయి. ఇలా చర్మసంబంధిత సమస్యలూ వస్తాయి. ఇక వైరస్‌ల వ్యాప్తికి అనువైన కాలం కావడంతో జలుబుతో ముక్కుకారడం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు పెరగడమూ కనిపిస్తుంది. ఈ చలికాలంలో కనిపించే సాధారణసమస్యలూ, వాటి పరిష్కారాలకుఅనుసరించాల్సిన 
సూచనలేమిటో చూద్దాం...

చలికాలంలో అన్నిటికంటే ఎక్కువగా బాధించే సమస్య కండరాలూ, కీళ్లనొప్పులు. పైగామామూలుగానే ఈ సమస్యతో బాధపడేవాళ్లలో ఈ సీజన్‌లో ఆ బాధలు కాస్తంత ఎక్కువగా బాధిస్తూ వేధిస్తాయి. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.

చలికాలంలో కండరాలూ, కీళ్లనొప్పులు పెరగడం ఎందుకంటే... 
ఈ సీజన్‌లో చలివల్ల చర్మం చాలా త్వరగా తన వేడిని కోల్పోతుంది. దాంతో చర్మం పైభాగంలో ఉండే రక్తనాళాలు కొద్దిగా కుంచించుకు΄ోతాయి. ఇలా కుంచించుకుపోవడాన్ని ‘వాసో కన్‌స్ట్రిక్షన్‌’ అంటారు. ఇలా కుంచించుకు΄ోవడంతో  ఆ ప్రాంతాలకు రక్తప్రసరణ కూడా కాస్త తగ్గుతుంది. దాంతో చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలైన ‘పెయిన్‌ సెన్సార్స్‌’ మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. 

ఈ పెయిన్‌ సెన్సర్స్‌ ఈ సీజన్‌లో ఇంకాస్త చురుగ్గా పనిచేయాల్సిరావడంతో చిన్న దెబ్బకే ఎక్కువ నొప్పి తెలుస్తుంటుంది. అందుకే చలికాలంలో ఒంటికి గాయాలైతే... దెబ్బ చిన్నదే అయినా, నొప్పి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ సీజన్‌లో కండరాలూ, కీళ్ల నొప్పులు పెరగడానికి దోహదం చేసే ఒక అంశం.  

ఇక మరో అంశమేమిటంటే... చాలామందిలో ఈ సీజన్‌లో నొప్పిని భరించే సామర్థ్యం (పెయిన్‌ టాలరెన్స్‌) తగ్గుతుంది. అందుకే బాధితులు మామూలు రోజుల్లోని నొప్పులూ కూడా ఈ కాలంలో మరింత పెరిగినట్లుగా అనిపిస్తాయి. 

ఈ సీజన్‌లో చలికి కీళ్లు బిగుసుకు΄ోతుంటాయి. దాంతో వాటిలో మామూలుగా ఉండాల్సిన కదలికలు కూడా బాగా తగ్గిపోతాయి. కీళ్లలో ఈ కదలికల తగ్గుదల కారణంగా మన రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసే ఒళ్లు కదల్చడం, నడక  వంటివి తగ్గిపోవడంతో దేహానికి ఒనగూరే వ్యాయామమూ, శారీరక శ్రమ కూడా తగ్గుతాయి. 

ఈ కారణం చేత కూడా కీళ్ల నొప్పులు బాగా పెరిగిపోతాయి. సాధారణంగా ఎముకలకు అందాల్సిన పోషకాలు దేహపు కదలికల వల్లనే వాటికి అందుతుంటాయి. ఈ కదలికలు తగినంతగా లేక΄ోవడంతో కీళ్లూ, ఎముకలకు అందాల్సిన పోషకాలూ సరిగా అందవు. 

మామూలుగా ఇతర సీజన్‌లలో కంటే... వింటర్‌ సీజన్‌లో సూర్యుడు చాలా తక్కువ సేపు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే చలికాలంలో పగటి నిడివి బాగా తక్కువగా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. ఫలితంగా మన దేహాలు, చర్మం  సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్‌ అయ్యే వ్యవధి కూడా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్‌లో మన ఎముకలకు అవసరమైన విటమిన్‌–డి పాళ్లూ తగ్గుతాయి. 

అంతేకాదు... ఈ కారణం వల్ల మరో అనర్థమూ పొంచి ఉంటుంది. అదేమిటంటే... ఏవైనా కారణాలతో ఈ సీజన్‌లో ఎముకలు ఫ్రాక్చర్‌ అయితే అవి అతుక్కోడానికి పట్టే వ్యవధి మిగతా కాలాలలో ΄ోలిస్తే ఈ సీజన్‌లో మరింత ఎక్కువగా ఉంటుంది.

ఒళ్లూ, కండరాల నొప్పులు తగ్గుదల కోసం ఇవీ కొన్ని పరిష్కారాలూ, సూచనలు
ఈ సీజన్‌లో వీలైనంత మేరకు గాయాల΄ాలు కాకుండా అలాగే వాహనాలు నడిపేటప్పుడు లేదా వ్యాయామాల సమయంలో దెబ్బలు తగలకుండా తమను తాము జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఆరుబయట నడుస్తున్నప్పుడు తాకుడురాళ్లు / ఎదుర్రాళ్లు తగలకుండా పాదం అంతా కప్పి ఉంచేలా మంచి షూస్‌ ధరించాలి. వేళ్లు బయటకు కనపడేలా ఉండే పూర్తిగా కవర్‌ చేయని చెప్పులూ, స్లిప్పర్స్‌ ధరించినప్పుడు కాలివేళ్లకు ఎదుర్రాయి తగిలి, చిన్న దెబ్బ తగిలినా, జివ్వుమనడం, చాలా బాధగా అనిపించడం, నొప్పి బాగా తెలుస్తుండటం జరుగుతుంది. 

షూస్‌ వల్ల కాళ్ల నుంచి వేడిమి కోల్పోకుండా ఉండటంతోపాటు, పాదాలకూ, కాలివేళ్ల చివరలకు పూర్తి రక్షణ కలుగుతుంది. అలాగే... వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్, నీ క్యాప్స్‌ వంటివి ధరించడం వల్ల గాయాలను / దెబ్బలను వీలైనంతగా నివారించుకోవచ్చు. 

ఆరుబయట చలిగా ఉన్నప్పుడు దేహానికి తగినంత వేడిని ఇచ్చేలా ఫుల్‌ స్లీవ్స్‌ ఉండే దుస్తులూ, ఊలు దుస్తులూ, ఉన్ని దుస్తుల వంటివి ధరించాలి. ఇవి దేహం నుంచి ఉష్ణోగ్రత బయటకు వెళ్లనివ్వకుండా దేహం వెచ్చగా ఉండేలా చూస్తాయి. అలాగే  చేతులకు గ్లౌవ్స్‌ వేసుకోవడం, కాళ్లకు సాక్స్‌ ధరించడం వంటి జాగ్రత్తలూ మేలు చేస్తాయి. ఆర్థరైటిస్‌ నొప్పులతో బాధపడేవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. 

ఈ సీజన్‌లో ఆరుబయట కాకుండా వీలైనంత మేరకు ఇన్‌డోర్‌ ఎక్సర్‌సైజ్‌లు  చేయాలి. ఈ వ్యాయామాల ఫలితంగా ఈ సీజన్‌లో మామూలుగానే కాస్తంత మందకొడిగా జరిగే రక్త సరఫరా ఉత్తేజితమై నార్మల్‌ స్థాయికి వస్తుంది. దాంతో నొప్పిని తెలిపే సెన్సర్స్‌ కూడా మామూలుగానే పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. 

చాలామంది చలి కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కాఫీ, టీ వంటి పానియాలను ఎక్కువగా తాగుతారు. దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీటిని కోల్పోతాం. వాటిని భర్తీ చేసేంతగా నీళ్లు తాగం. 

ఇలా నీరు తక్కువ తాగడం, చెమట కారణంగా మనకు తెలియకుండానే దేహం డీహైడ్రేషన్‌కు లోనయ్యే ముప్పు పొంచి ఉంటుంది.  ఈ కారణాలన్నింటి వల్ల శరీరంలో నీళ్లు,  లవణాల మోతాదులు బాగా తగ్గి΄ోతాయి. అందుకే ఈ సీజన్‌లో తరచూ నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 

డాక్టర్‌లు విటమిన్‌–డి సప్లిమెంట్స్‌ వాడాలని సూచించినవారు ఆ మేరకు వాటిని వాడాలి. సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్‌ బాధితులకు ఈ సీజన్‌లో వారి నొప్పుల బాధలు మరింత పెరుగుతాయి. అందుకే ఆస్టియో ఆర్థరైటిస్‌ బాధితులు ఈ సీజన్‌లో  తమ డాక్టర్‌ సలహా మేరకు విటమిన్‌–డి సప్లిమెంట్లు తప్పక వాడాల్సిందే. 

చలికాలంలో ఈ సూచనలూ, జాగ్రత్తలతో కీళ్ల, కండరాల నొప్పులను చాలావరకు నివారించుకోవచ్చు. తమ ఒళ్లునొప్పుల వంటి బాధల నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చు. ఈ సూచనలు పాటించాక కూడా కండరాల నొప్పులూ, కీళ్ల నొప్పులూ, ఒళ్లునొప్పులూ తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు, వాటి ఫలితాలను బట్టి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

జలుబులూ... ఇతర వైరల్‌ జ్వరాలు 
మనలో జలుబు రావడానికి రెండువందల రకాలకు వైరస్‌లు కారణమవుతాయి. ఈ రెండు వందలకు పైగా వైరస్‌లనూ, వాటిలో కనిపించే కొన్ని సమాన లక్షణాలను బట్టి గ్రూపులుగా విభజిస్తే... అందులో ఆరు రకాల గ్రూపులతో జలుబు వస్తుంటుందన్నది వైద్య నిపుణుల మాట. ఆ వైరస్‌లు ఏమిటంటే... 

1) ఇన్‌ఫ్లుయెంజా, 2) పారాఇన్‌ఫ్లుయెంజా, 3) రైనోవైరస్, 4) ఎడినో వైరస్, 5) హ్యూమన్‌ రెస్పిరేటరీ నిన్సీషియల్‌ వైరస్‌  6) బీఎఫ్‌–7 వేరియెంట్‌ అనేవి. గత కొన్నేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ బాధించిన కరోనా వైరస్‌ కూడా ఈ బీఎఫ్‌ వేరియెంట్‌ కిందకే వస్తుంది. కాక΄ోతే ఇప్పుడు కరోనా వైరస్‌ మునపటి తీవ్రత కోల్పోయిన కారణంగా అప్పుడప్పుడు అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ జలుబులో ఉండే మామూలు లక్షణాలనే ప్రదర్శిస్తోంది. 

లక్షణాలు... 
జలుబు వచ్చినప్పుడు కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, గొంతులో గరగర,  ముక్కు నుంచి లేదా ముక్కుతోపాటు కళ్ల నుంచి నీరు కారుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వైరస్‌ సోకిన 5 నుంచి 7 రోజుల్లో ఈ లక్షణాలన్నీ తగ్గి΄ోతాయి. అయితే అరుదుగా కొన్ని సార్లు మాత్రం ఈ వైరస్‌లు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి నిమోనియా అనే ప్రమాకరమైన కండిషన్‌కు  కారణమవుతాయి. మామూలు నిమోనియాతో పోలిస్తే... ఇలా ఒక వైరస్‌ కారణంగా వచ్చే సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారిగా పరిణమిస్తుంది. 

జలుబుగానీ లేదా ఇతరత్రా వైరస్‌ల వల్లగానీ సమస్య శ్వాసవ్యవస్థలోని పైభాగంలో అంటే అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌లో ఉంటే... అది చాలావరకు దానంతట అదే తగ్గి΄ోతుంది. కానీ ఒకవేళ పైన పేర్కొన్న వైరస్‌లు శ్వాస వ్యవస్థలో మరికాస్త లోతుకు వెళ్లి... అక్కడి కింది భాగాలకు అంటే... లోయర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌ వరకు వ్యాపిస్తే అది నిమోనియాకు దారితీస్తుంది. అప్పుడు సమస్య ఇంకాస్త తీవ్రమవుతుంది. కొన్నిసార్లు ముక్కు, శ్వాసకోశ వ్యవస్థల్లోని సన్నని ఎపిథీలియల్‌ ΄÷ర దెబ్బతినడం వల్ల అక్కడికి బ్యాక్టీరియా చేరి సైనుసైటిస్, ఫ్యారింజైటిస్‌ వంటి ఇతర సమస్యలూ వచ్చే అవకాశాలూ ఉంటాయి. 

నివారణ... 

మంచి పుష్టికరమైన సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ సీజన్‌లో ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.  ఈ జాగ్రత్తల వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఇమ్యూన్‌ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. దీనివల్ల జలుబుతోపాటు... ఇతరత్రా జబ్బులనుంచీ దేహానికి మంచి రక్షణ దొరుకుతుంది 

జలుబు వచ్చినవారు నేరుగా ఇతర వ్యక్తులపై తుమ్మడం, దగ్గడం చేయకూడదు.  

తుమ్మే సమయంలో లేదా దగ్గేటప్పుడు చేతిరుమాళ్లు, టిష్యుపేపర్లు వంటివాటిని అడ్డు పెట్టుకోవడం అవసరం. అవి లేనప్పుడు కనీసం మోచేతి మడతలో తుమ్మడం, దగ్గడం చేయాలి. ఇక తరచూ చేతులు కడుక్కోవడం లేదా శానిటైజ్‌ చేసుకోవడం, ఇతరులనుంచి భౌతిక దూరాన్ని పాటించడం, గుంపుల్లోకి (క్రౌడ్స్‌లోకి) వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సీజన్‌లో జలుబు మాత్రమే కాకుండా అనేక ఇతర వైరస్‌ల కారణంగా వచ్చే వైరస్‌ జబ్బులను నివారించుకోవచ్చు. 
డాక్టర్‌ వెంకట్‌ నాని కుమార్‌ .బి, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement