నూజివీడు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి
నూజివీడు: జిల్లాలో ఎక్కడా లేనివిధంగా గత ప్రభుత్వం నూజివీడులోని ఏరియా ఆస్పత్రిలో రూ.24 కోట్లతో ఆధునిక భవనాన్ని నిర్మించి వైద్య సేవలకు అందుబాటులోకి తీసుకువస్తే దానిని నిర్వహించడం కూడా ప్రస్తుత పాలకులకు చేతకావడం లేదని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం తాను ఆస్పత్రికి వెళ్లి పరిశీలించగా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. నూతన భవన నిర్మాణం అందుబాటులోకి రావడంతో ఏరియా పెరిగిందని, ఈ పరిస్థితుల్లో గతం నుంచి పనిచేస్తున్న 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు పనిభారం పెరిగిందన్నారు. మరో 20 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. జిల్లాలో ఏలూరు జిల్లా ఆస్పత్రి మెడికల్ కాలేజీగా మారిన నేపథ్యంలో నూజివీడు ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ఈ మేరకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. 300 బెడ్లు ఏర్పాటు చేయడానికి బెడ్లు, 8 ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ వార్డు ఉన్నందున పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 17 మంది వైద్యులే ఉన్నారని, ఇంకా పలు విభాగాలకు స్పెషలిస్టు వైద్యులు లేరన్నారు. జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయితే పలువురు స్పెషలిస్టు వైద్యుల నియామకం జరుగుతుందన్నారు. అలాగే ఆస్పత్రి ప్రాంగణంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, కంకర తేలి గుంతలమయం కావడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ప్రాంగణంలోని రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే పాలకులకు ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలన్నారు. దీనిలో భాగంగానే గత ప్రభుత్వంలో ఏరియా ఆస్పత్రిలో నూతన భవనంతో పాటు పట్టణంలో మరో రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవనాలు, గ్రామగ్రామానా విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు భవనాలను నిర్మించామన్నారు.


