గంగానమ్మ జాతరకు 200 ఏళ్ల చరిత్ర
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో గంగానమ్మవారి జాతరకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉందని, తరతరాలుగా వస్తున్న ఆచారమిదని వక్తలు అన్నారు. నగరానికి చెందిన హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో అట్టహాసంగా జరుగుతున్న జాతరపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేటి తరం జాతర నియమావళిపై సంపూర్ణ విశ్వాసం, అవగాహనతో భావితరాలకు జాతర ప్రాశస్త్యాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఉత్సాహంగా, కృతజ్ఞతాపూర్వకంగా జాతరలో పాల్గొనాలని కోరారు. తూర్పు వీధి, పడమర వీధి, దక్షిణపు వీధి, పవరుపేట, లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేట, తంగెళ్లమూడి కొలుపుల కమిటీల ప్రతినిధులు జాతర విశేషాలను పంచుకున్నారు. తొలుత గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అమ్మవార్లను కళావేదికపై కొలువు తీర్చారు. వైఎంహెచ్‌ఏ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్రా సోమలింగేశ్వరరావు, కేవీ సత్యనారాయణ, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇరదల ముద్దుకృష్ణ, మజ్జి సూర్యకాంతరావు, వేణుగోపాల్ లునాని, వీవీ బాలకృష్ణారావు, జవ్వాజీ మోహన్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.


