సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్లకు చెక్‌

Nov 2 2025 9:34 AM | Updated on Nov 2 2025 9:34 AM

సైబర్‌ నేరగాళ్లకు చెక్‌

సైబర్‌ నేరగాళ్లకు చెక్‌

దేశమంతా జల్లెడ పట్టిన ఏలూరు పోలీసులు

8 మంది అరెస్టు

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా పోలీసులు సాహసోపేతమైన ఛేజింగ్‌తో సైబర్‌ నేరగాళ్ళ ఆగడాలకు చెక్‌ పెట్టారు. ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఒక కేసు దర్యాప్తులో భాగంగా తీగ లాగితే డొంకంతా కదలింది ఏకంగా రాష్ట్రాలతోపాటు, ఇతర దేశాల్లోని సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఏలూరు జిల్లా పోలీసుల దర్యాప్తు ఉపయోగపడుతోంది. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్‌ చేసి నేరాల దర్యాప్తుపై వివరాలు వెల్లడించారు. ఏకంగా ఏడు రాష్ట్రాలను జల్లెడ పట్టి సైబర్‌ నేరాలకు పాల్పడే సూత్రధారుల వద్దకే ఏలూరు జిల్లా పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు.

వేట మొదలైందిలా..

ఏలూరు ఆర్‌ఆర్‌ పేటకు చెందిన ఒక వృద్ధురాలు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.58 లక్షల నగదు సైబర్‌ నేరగాళ్ళు కాజేశారంటూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్దురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ సైబర్‌ నేరాలను ఛాలెంజింగ్‌ తీసుకున్నారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ పర్యవేక్షణలో 4 పోలీస్‌ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. టూటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ మధువెంకట రాజా, భీమడోలు సీఐ యూజే విల్సన్‌, సీఐ సుభాష్‌తో కూడిన నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలు సైబర్‌ నేరగాళ్ల మూలాలను ఛేదించేందుకు వేట ప్రారంభించారు.

ఏడు రాష్ట్రాల్లో 14 వేల కిలోమీటర్ల ప్రయాణం

ఏలూరు జిల్లా పోలీస్‌ బృందాలు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, కర్నాటక, తమిళనాడుతో పాటు నేపాల్‌ను చుట్టేశారు. ఏకంగా 14 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి నేరగాళ్లను పట్టుకునేందుకు శ్రమించారు. ముంబైకి చెందిన పూనమ్‌ ప్రవీణ్‌ సోనావాలేను ప్రధాన నిందితురాలి గుర్తించారు. ఈమె మ్యూల్‌ అకౌంట్లు దేశవ్యాప్తంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. యూపీకి చెందిన సచీంద్ర శర్మ, నితిన్‌ మిశ్రా, హర్షిత్‌ మిశ్రా, అభిషేక్‌ కశ్యప్‌, గోపాల్‌ యాదవ్‌, కో–ఆపరేటివ్‌ బ్యాంకులో రీజనల్‌ మేనేజర్‌గా పనిచేసే సందీప్‌ అలోనీ, హెడ్‌కానిస్టేబుల్‌ సందీప్‌తో పాటు మరో ముగ్గురు నేరస్తులను గుర్తించారు. 11 మంది సైబర్‌ నేరగాళ్లను గుర్తించగా 8 మందిని అక్టోబర్‌ 26న ఏలూరు తరలించి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

ఏపీకే ఫైల్స్‌తో మోసాలు

సైబర్‌ నేరగాళ్ళు వినియోగిస్తున్న 12 రకాల హానికర ఏపీకే ఫైల్స్‌ను పోలీసులు గుర్తించారు. వీరంతా బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును క్రిప్టో కరెన్సీ ద్వారా కంబోడియా, చైనా వంటి దేశాలకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో రూ.2.25 కోట్లు మ్యూల్‌ అకౌంట్‌ నుంచి తరలించినట్లు గుర్తించారు. ఈ భారీ నెట్‌వర్క్‌ మన దేశంతో పాటు కంబోడియా, సింగపూర్‌, నేపాల్‌, చైనా, అమెరికా వంటి దేశాల్లోనూ ఉన్నట్లు పోలీస్‌ దర్యాప్తులో వెల్లడైంది. వేల కోట్లు సొమ్ము సైబర్‌ నేరగాళ్ళ ఖాతాల్లో ఉన్నాయి. నగదు ఫ్రీజ్‌కు సైతం ఆయా బ్యాంకులకు దర్యాప్తు బృందాలు అభ్యర్థన పత్రాలు అందజేశాయి. కంబోడియాలోని ప్రత్యేక ఆన్‌లైన్‌ సర్వర్లకు, ఆలీబాబా సర్వర్‌కు జిల్లా పోలీసులు ఇప్పటికే అభ్యర్థన పంపారు. ఈ దర్యాప్తు బృందంలో సైబర్‌ సెల్‌ సీఐ దాసు, చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్‌, ఎస్సై వై.సుధాకర్‌, ఎస్‌బీ ఎస్సై వీరప్రసాద్‌, ఎస్సై వల్లి పద్మ, ఏఎస్సై అహ్మద్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు రవికుమార్‌, శ్రీనివాస్‌, సెల్‌ ట్రాకింగ్‌ హెచ్‌సీ వెంకట సత్యనారాయణ, సైబర్‌ సెల్‌ కానిస్టేబుల్‌ శివకుమార్‌, బి.నాగరాజు, బి.రామకృష్ణ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement