పెదపాడు మండలం వట్లూరుకు చెందిన ఇంటూరి నాగు కౌలు రైతు. ఎకరాకు ఇంతవరకూ రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేశాడు. మరో 10 రోజులు ఆగితే కోతలు పూర్తయ్యేవని, కనీసం పెట్టుబడులైనా దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట పూర్తిగా నేలవాలిందని, గింజ రంగు మారిపోయి తాలుగింజలు అవ్వడంతో భారీ నష్టం మిగిలిందని వాపోతున్నాడు. ప్రభుత్వం సాయం చేయకపోతే అప్పుల పాలుకాక తప్పదంటున్నాడు.
పెదపాడుకు చెందిన మానం సత్యనారాయణ పెద్ద కౌలు రైతు. 40 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వాతావరణం గత వారం వరకు బాగుండటంతో వచ్చే నెలాఖరుకల్లా పంట అమ్మకం పూర్తి చేసి పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు జమ చేయాలనుకున్నాడు. ఈలోపు తుపాను దెబ్బకు పంట నేలకొరగడం, కుళ్ళిపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చే పంట ఇప్పుడు 15 బస్తాలు కూడా దాటదు. దానిలో రంగుమారిన గింజ ఎక్కువగా ఉంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయరు. కౌలురైతు కావడంతో తమకేమీ రాదని, తమను పట్టించుకునేవారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మళ్ళీ ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు పెట్టుబడి పెడితేనే గానీ ఉన్న నాలుగు గింజలు బయటకు రాని పరిస్థితని వాపోతున్నాడు.
మోంథా ముంచేసింది


