తప్పు ఒప్పుకున్న టీడీపీ నేత
● ఐఎస్ జగన్నాథపురంలో శాంతించిన వరి రైతులు
● న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు
ద్వారకాతిరుమల: మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో వరి పంటలు నీట మునగడానికి ఓ టీడీపీ నేత కారణమైన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుని ఆ నేత సోదరుడు (టీడీపీ నేత) శుక్రవారం రైతుల ముందు తప్పయ్యిందని ఒప్పుకున్నాడు. అలాగే రెవెన్యూ అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు శాంతించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు రైతులకు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా గురువారం ఉదయం ఎర్రచెరువు తూముకు ఉన్న లాకును ఎత్తేశాడు. దీంతో సుమారు 30 మంది రైతులకు చెందిన 40 ఎకరాల వరి పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీటిపాలైందని రైతులు గగ్గోలు పెట్టారు. అలాగే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ‘సాక్షి’లో శుక్రవారం ‘పచ్చనేత నిర్వాకంపై రైతుల గగ్గోలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ దుర్గా మహాలక్ష్మి, మండల వ్యవసాయాధికారి చెన్నకేశవులు, ఆర్‌ఐ సత్యం, వీఆర్వో సత్యనారాయణ శుక్రవారం నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. అయితే పంట పొలాల్లోకి నీరు ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని రైతులు పట్టుబట్టారు. దీంతో నీరు వదిలిన నాయకుడి సోదరుడు వచ్చి, తన అన్న అందుబాటులో లేడని, జరిగింది తప్పేనని ఒప్పుకున్నాడు. అలాగే అధికారులు న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇకపై రైతులు ఎవరైనా పొలాలకు నీరు పెట్టుకోవాలంటే ముందుగా పంచాయతీ అధికారుల అనుమతి పొందిన తర్వాతే చెరువు తూముకు ఉన్న లాకును ఎత్తాలని అధికారులు సూచించారు.


