
టీడీపీ నేతల నీచ సంస్కృతికి నిదర్శనం
ఏలూరు టౌన్: టీడీపీ నేతలు రాష్ట్రంలో మహిళాలోకం ఆగ్రహానికి గురికాకతప్పదనీ.. వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై దుర్భాషలాడుతూ, దాడులకు తెగబడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ నేతల దాడి, దౌర్జన్యంపై శనివారం ఏలూరులోని జి ల్లా కార్యాలయంలో మహిళా నేతలు, జెడ్పీటీసీలతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ, సినీరంగంలో రాణిస్తున్న మాజీ మంత్రి రోజా ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ కుటుంబంలోని మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సమర్థిస్తారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజూ ఏదో ఒకచోట బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే మహి ళా హోం మంత్రి కనీసం నోరు మెదపలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, టీడీపీ నేతల నీచ సంస్కృతికి ఇది నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబుకు మహిళలపై చిత్తశుద్ధి ఉంటే నగరి టీడీపీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పేరుతో రాక్షస పాలన సాగుతోందనీ.. ఇటీవల కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ మూ కలు, గుండాల్లా వ్యవహరిస్తూ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమన్నారు.
అనుచిత వ్యాఖ్యలు సహించం
పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకీరెడ్డి మాట్లాడుతూ నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ మహిళా నేతలను తీవ్ర పదజాలంతో దూషిస్తూ మాట్లాడటం హేయమన్నారు. ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. దెందులూరు జెట్పీటీసీ నిట్టా లీలానవకాంతం మాట్లాడుతూ ఎమ్మెల్యే భానుప్రకాష్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే మహిళాలోకం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి ఇంజేటి నీలిమ, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసీ, రాష్ట్ర అంగన్‌వాడీ కార్యదర్శి ఇందిరమ్మ, జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు సాయిల స్వాతి యాదవ్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మంద జయలక్ష్మి, ఏలూరు కార్పొరేటర్ తుమరాడ స్రవంతి, సీనియర్ మహిళా నేత తులసీ వర్మ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి సిగ్గుచేటు
వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సరితారెడ్డి