
కాలువలో మృతదేహం లభ్యం
గుంటూరు వాసిగా గుర్తింపు
ఉంగుటూరు: ఉంగుటూరులోని ఏలూరు కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు గుంటూరుకు చెందిన గుంజి దుర్గనారాయణ (42)గా పోలీసులు గుర్తించారు. మద్యం సేవిస్తూ మతి స్థిమితం లేనట్లుగా తిరుగుతుంటాడని, ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని, అతడి కాలికి పోలియో ఉందని చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. నాలుగురోజులు క్రితం గూడెం ప్రాంతంలో కాలువలో పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అతని జేబులో ఉన్న వివరాల ప్రకారం సమాచారాన్ని బంధువులకు తెలియజేసినట్లు ఎస్సై చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తాడేపల్లిగూడెం మ్యాచురీలో భద్రపరిచారు.
పాము కాటుకు వ్యక్తి మృతి
యలమంచిలి: మండలంలోని పెదలంక గ్రామానికి చెందిన గెద్దాడ నాగేశ్వరరావు (57) పాముకాటుకు గురై మరణించినట్లు హెడ్ కానిస్టేబుల్ ఈతకోట సత్యనారాయణ తెలిపారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే నాగేశ్వరరావు గురువారం పశువులకు గడ్డి కోస్తుండగా పాముకాటు వేసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుమారుడు నాగ శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతి అదృశ్యంపై కేసు నమోదు
పాలకొల్లు సెంట్రల్: ఉల్లంపర్రు గ్రామంలోని సత్యసాయి కాలనీకి చెందిన యువతి అదృశ్యంపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆమె సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఎస్సై బి సురేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.