
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు
తణుకు అర్బన్: రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు పెరిగిపోవడం బాధాకరమని బీసీ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రాధాన్యతతో పాటు భద్రత లేకుండా పోతున్న ఘటనలు బాధాకరమన్నారు. తణుకు సురాజ్య భవన్‌లో మంగళవారం బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహిళా రాజకీయ రిజర్వేషన్లు, బీసీ మహిళా సబ్ కోటాపై రాష్ట్ర మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న మహిళకు కనీసం ఒక ఎస్సైని బదిలీ చేయించే అధికారం కూడా లేకుండా రాజకీయంగా తమ పరిధిలోనే ఉంచుకోవడం అన్యాయమన్నారు. దేశ వ్యాప్తంగా భవిష్యత్తులో జనగణనకు కార్యాచరణ సిద్ధమైందని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ తెలిపారు. బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, జిల్లా మహిళాధ్యక్షురాలు కొలగాని కృష్ణవేణి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో జాతీయ ఉపాధ్యక్షుడు కాగిత సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజాచారి, జాతీయ మహిళాధ్యక్షురాలు వై.లక్ష్మీశైలజ, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పీవీ రమణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు అన్నం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మటపత్తి సూర్యచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లుక్కా వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.