
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం విద్యార్థులతో కలిసి ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దీనివల్ల డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు సైతం హాల్ టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ఏలూరు జిల్లా కోశాధికారి, ఎం.క్రాంతికుమార్, సునీల్, ప్రదీప్, విద్యార్థులు పాల్గొన్నారు.