
జీవితాలతో చెలగాటం
ఏలూరు టౌన్: అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడైనా భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని అదుపు చేసేందుకు అవసరమైన అగ్నిపమాక వాహనాలు, సిబ్బంది లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు, కార్మికుల ప్రాణాల భద్రత గాల్లో దీపమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు నగరంలోనే గత మూడు నెలల్లో మూడు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. పైగా ఒకే తరహా వస్తువుల తయారీ ఇండస్ట్రీల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. యాజమాన్యల నిర్లక్ష్యం.. అగ్నిమాపక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరులో వరుసగా అగ్నిప్రమాదాలు
ఏలూరు జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకూ సుమారుగా 598 అగ్నిప్రమాదాలు సంభవించగా ఏలూరు శివారు ప్రాంతాల్లో వరుసగా మూడు నెలల్లో మూడు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ మూడు అగ్నిప్రమాదాలు పరుపులు, ఫర్నిచర్ తయారీ పరిశ్రమల్లో కావటం గమనార్హం. అదృష్టవశాత్తు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో కార్మికులు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఏలూరు శివారులోని గణేష్ సోఫా అండ్ ఫర్నిచర్స్ పరిశ్రమలో జూన్ 5న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం వేళలో ప్రమాదం జరగడం, కార్మికులు ముందుగానే గుర్తించి బయటకు పారిపోవటంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే తరహాలో ఏలూరు సోమవరప్పాడులోని సోఫా, పరుపుల తయారీ కంపెనీలోనూ అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా గురువారం వంగాయగూడెం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో సుష్మిత ఫర్నిచర్, కుషనింగ్ తయారీ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయాల ఆస్తి నష్టం జరిగింది.
ప్రమాదాల నివారణ సాధ్యమేనా?
ఏలూరు జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖకు కేవలం రెండే ఫైరింజన్లు ఉన్నాయి. ఒక ఫైరింజన్ మరమ్మతుల్లో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫైరింజన్ సామర్థ్యంపై ఆధారపడితే తీవ్ర పరిణామాలు తప్పవని అంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో లేరంటున్నారు. దీనితోడు పరిశ్రమల్లో పాటించాల్సిన భద్రతా చర్యలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా వంగాయగూడెం సుస్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం సంభవించడంతో.. అసలు పరిశ్రమకు ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్, అత్యవసర ద్వారం లేదని, ఫైర్‌సేఫ్టీ చర్యలపై అధికారుల పర్యవేక్షణపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ పరిశ్రమలు, ఇండస్ట్రీలు, ఆయా వస్తువుల ఉత్పత్తి సంస్థల్లో ఫైర్‌సేఫ్టీపై నిఘా, పర్యవేక్షణ, తనిఖీలు లేవంటున్నారు.
మూడు నెలల్లో 3 భారీ అగ్నిప్రమాదాలు
రెండు ఫైరింజన్లతో నెట్టుకొస్తున్న అగ్నిమాపక శాఖ
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ప్రజలు భద్రత ప్రశ్నార్థకంగా మారిన వైనం

జీవితాలతో చెలగాటం

జీవితాలతో చెలగాటం