
పరుపుల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో శివారు వంగాయగూడెంలోని పరుపుల పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వంగాయగూడెం కేన్సర్ హాస్పిటల్ సమీపంలోని సుస్మిత ఫర్నిచర్ కుషనింగ్ పరిశ్రమలో ఉదయం 9.30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరూ రాకముందే ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో ఫోమ్‌ను తయారు చేస్తారు. ఈ రసాయనాల మిక్సింగ్‌కు వినియోగించే ట్యాంకర్‌ను మైనస్ డిగ్రీల్లో చల్లబరుస్తారు. కెమికల్ మిక్సింగ్ ట్యాంకర్‌కు సంబంధించిన ఏసీలను ఆన్ చేసిన వాచ్‌మెన్లు ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాప్తి చెందటంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.

పరుపుల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం