
ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వ్యాపారాలతో అభివృద్ధి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలను ఔత్సాహిక వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి ఆర్టీసీ కృషి చేస్తోందని ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం అన్నారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఔత్సాహిక వ్యాపారులతో ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని కలిదిండి, భీమవరం, ఆకివీడు ప్రాంతాల్లోని ఆర్టీసీ ఖాళీ స్థలాలను 15 సంవత్సరాలకు లీజుకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించామన్నారు. ఈ టెండర్లకు సంబంధించిన వివరాలు, లీజుకు ఉండే నియమ నిబంధనలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజ్ బీ. వాణి, డీఈ బీవీ రావు, ఏఈ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉర్దూ పాఠశాల వివాదంపై ఆర్‌జేడీ విచారణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మాకా) ఉర్దూ పాఠశాల, తూర్పువీధి ఉర్దూ పాఠశాలల్లో జరుగుతున్న వివాదాలపై పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ జి.నాగమణి బుధవారం విచారణ నిర్వహించారు. తొలుత ఆ రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలోనూ రెండు మాధ్యమాల్లో విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి ఉందని, ఈ రెండు పాఠశాలల్లో సైతం అదే విధానం అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే మాధ్యమంలోనే ఉపాధ్యాయులు బోధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నుంచి రెండు మాధ్యమాల్లో బోధిస్తామని లేఖలు రాయించుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని ఈ విచారణలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
భీమవరం: ఉండి మండలం చెరుకువాడ వద్ద గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం బుధవారం చెప్పారు. ఈ నెల 1న గుర్తు తెలియని 50 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.