
చికిత్స పొందుతూ యువకుడి మృతి
చింతలపూడి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సతీష్‌కుమార్ బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపాలెం గ్రామానికి చెందిన తులిమెల్లి త్రినాథ్ (24) చింతలపూడి వైష్ణవి మెడికల్ షాప్‌లో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 5న రాత్రి మెడికల్ షాప్ కట్టి ద్విచక్రవాహనంపై స్వగ్రామం లింగపాలెం బయలుదేరాడు. చింతలపూడి బైపాస్ రోడ్డు వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి గుంతలో పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించి మెరుగైన చికిత్సకోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ త్రినాథ్ చనిపోవడంతో మృతుని తండ్రి తులిమెల్లి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భార్య, పిల్లలు కనిపించడం లేదని భర్త ఫిర్యాదు
భీమవరం: తన భార్య బెల్లం రమ్య, తన పిల్లలు కన్పించడం లేదంటూ భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన బొల్లం సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రామరావు చెప్పారు. వివరాల ప్రకారం ఈ నెల 5న సుబ్బారావు పనికివెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య, పిల్లలు కన్పించలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన ప్రయోజనం లేకపోవడంతో సుబ్బారావు పోలీసులను ఆశ్రయించాడు.