
పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు
ఏలూరు టౌన్: జిల్లాలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తున్నామనీ, సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య భరోసాకు ఉచిత మెగా హెల్త్ చెకప్ ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ఏలూరు పత్తేబాదలోని కామినేని హాస్పిటల్‌లో ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పని చేస్తోన్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, హోంగార్డులకు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందించేలా చర్యలు చేపట్టారు. బీపీ, షుగర్, ఈసీజీ, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, విటమిన్ డీ, బీ12, సీబీపీ, వంటి ముఖ్యమైన పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 30 వరకూ ప్రతి రోజూ 100మంది చొప్పున 1969 మంది సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ డాక్టర్ కొడాలి రామ్ ప్రసీన్, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్‌ఐ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.