
నాణ్యమైన ఆహారం అందించాలి
ఏలూరు (టూటౌన్): వసతి గృహాంలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అమీనాపేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వసతి గృహం కిటికీలకు దోమల మెష్ లేకపోవడం వల్ల దోమల బెడద ఉంటుందని విద్యార్థులు తెలిపారని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. వసతి గృహానికి రాని విద్యార్థుల వివరాలు సేకరించి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, తిరిగి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.