పైసలిస్తేనే మీటర్లు..! | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే మీటర్లు..!

Jul 9 2025 6:38 AM | Updated on Jul 9 2025 6:38 AM

పైసలిస్తేనే మీటర్లు..!

పైసలిస్తేనే మీటర్లు..!

బ్యాంక్‌ కాలనీలో

రూ.10 వేలు డిమాండ్‌

తణుకు బ్యాంక్‌ కాలనీలో ఒక భవనానికి రెండు మీటర్లు ఇచ్చే క్రమంలో గత నెలలో రూ.10వేలు డిమాండ్‌ చేసిన అవినీతి భాగోతం ప్రస్తుతం తణుకులో చర్చనీయాంశమైంది. మీటరుకు రూ.5 వేలు చొప్పున రెండు మీటర్లకు రూ. 10 వేలు ఇవ్వాలన్న డిమాండ్‌ను వినియోగదారుడు గట్టిగానే ఎదుర్కొనడంతో మెల్లగా జారుకున్నారు. పైగా ఈ వసూళ్ల పర్వంలో నేను ఒక్కడినే తినేయనని మాపై అధికారులకు కూడా ఇవ్వాలంటూ ఘరానాగా వసూళ్లకు దిగుతుండడం శోచనీయం. అపార్టుమెంట్లలో ట్రాన్స్‌ఫార్మర్లు,, మీటర్లు ఇచ్చే క్రమంలో జరుగుతున్న అవినీతిలో వినియోగదారులు, అధికారుల మధ్య వారధిగా ప్రైవేటు వ్యక్తుల జోక్యం కూడా ఉండడంతో విషయం బయటకు పొక్కకుండా లక్షల్లో దోచేస్తున్న వైనాన్ని విద్యుత్‌ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. సాధారణ ఇంటికి మీటరు బిగించాలంటే రూ.5 వేలు అడుగుతున్నారంటే మేమెక్కడి నుంచి తేవాలంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులివ్వకపోతే ఏదోక కొర్రీలు వేసి మీటర్ల పంపిణీలో జాప్యం చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

తణుకు అర్బన్‌: తణుకు విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయ సేవలకు అవినీతి మరకలు అంటుతున్నాయి. అత్యవసరంగా అందాల్సిన విద్యుత్‌ శాఖ సేవలు వినియోగదారులకు కరెంట్‌ షాకిస్తున్నాయి. సబ్‌ డివిజన్‌ పరిధిలోని కిందిస్థాయిలో అవినీతి తిమింగలాల మాదిరిగా ఉన్న కొందరు ఉద్యోగుల తీరుతో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అవినీతికి సంబంధించి జరుగుతున్న పంపకాల్లో తేడాలు ఇటీవల ఆ అవినీతి వ్యవహారాన్ని బయటపెడుతున్నాయి. పైసలిస్తేనే మీటరు అనే స్థాయిలో కొందరు కిందిస్థాయి ఉద్యోగులు వినియోగదారుల నుంచి అందినకాడికి గుంజేసే పరిస్థితి నేడు దాపురించిందని పలువురు వాపోతున్నారు. ఇందుకు ఉదాహరణగానే ఇటీవల డీ 2 సబ్‌ స్టేషన్‌లో పంపకాల్లో వాటాలు తెగకపోవడంతో ఒకరిపై ఒకరు వాగ్వాదాలు, ఘర్షణలు, దాడులకు పాల్పడుతున్నట్లుగా సాక్షాత్యూ విద్యుత్‌ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.

మీటరు బిగించాలంటే..

మీటరు బిగించాలంటే పైసలివ్వాల్సిందే అనే రీతిలో కొందరు ఉద్యోగులు ఖరాకండిగా తెగేసి చెబుతుండడం వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎందుకు డబ్బులివ్వాలని నిలదీస్తుంటే ఇంత డబ్బు పెట్టి ఇళ్లు కట్టుకున్నారు కదా మాకు ఇవ్వడానికి చేతులు రావడంలేదా అని నిలదీసే పరిస్థితి తణుకులో దాపురించిందని వినియోగదారులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి కిందిస్థాయిలో పాతుకుపోయిన కొందరు ఉద్యోగులు ఇక్కడే తిష్టవేసి జబర్‌దస్త్‌గా అందినకాడికి గుంజేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

ఈ విషయంపై తణుకు సబ్‌ డివిజన్‌ డీఈఈ బోడపాటి దివాకర్‌ను శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా ఇటీవల డీ2 సబ్‌స్టేషన్‌లో జరిగిన గొడవపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించానని, మీటర్లపై డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారం తన దృష్టికి రాలేదని చెప్పారు. తాను గతనెల 27న విధుల్లో చేరానని డబ్బులు డిమాండ్‌ చేసే వ్యవహారంపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

విద్యుత్‌ శాఖలో అవినీతి తిమింగలాలు

అపార్టుమెంట్‌లకు ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ల మంజూరులో లక్షల్లో చేతులు మారుతున్న వైనం

డబ్బులివ్వకపోతే మీటర్ల జారీలో కొర్రిలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement