
అన్నదాత సుఖీభవ అర్హతను పోర్టల్‌లో చూసుకోవాలి
తణుకు అర్బన్: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత వివరాలపై పోర్టల్ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం తణుకు మండలం దువ్వలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన రైతులకు అనర్హత వస్తే తమ అర్హతకు సంబంధించిన పత్రాలను గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్లి గ్రీవెన్స్ పోర్టల్‌లో ఈనెల 12వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని ప్రస్తుతం 44,792 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలోని ప్రైవేటు, మార్క్‌ఫెడ్స్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దువ్వ గ్రామంలో 3,530 ఎకరాలు వరి సాగు చేస్తున్నారని దీనిలో సుమారు 40 శాతం మిషన్ ద్వారా నాట్లు వేస్తున్నారని ఇది చాలా శుభ పరిణామం అన్నారు.
త్వరలో ధాన్యం డబ్బులు
రైతులు గత సీజన్‌కు సంబంధించిన మిగిలిన ధాన్యం డబ్బులు రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో రైతుల ఖాతాలకు జమవుతాయని జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. దువ్వ గ్రామానికి చెందిన కొందరు రైతులు గత సీజన్లో ట్రాక్టర్లు, లారీల ద్వారా రైస్ మిల్లులకు రైతుల ధాన్యాన్ని చేరవేశామని దీనికి సంబంధించి ఇప్పటి వరకు మాకు రవాణా సొమ్ము అందలేదని అడగ్గా, ఈ సమస్యను సివిల్ సప్లయి విభాగ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం యాంత్రీకరణ ద్వారా రైతులు నాట్లు చేస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎంపీపీ రుద్రా ధనరాజు, తణుకు వ్యవసాయ సహాయ సంచాలకులు జి నరేంద్ర, డీఆర్‌సీ వ్యవసాయ అధికారిణి జి. బాల నాగేశ్వరమ్మ, మండల వ్యవసాయ అధికారి కే రాజేంద్రప్రసాద్, దువ్వ పీఏసీఎస్ సెక్రటరీ కిరణ్ వీఏఏలు మల్లికార్జున్, అరుణ్, పుష్ప, ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు