
సమన్వయంతో కేసుల సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): మధ్యవర్తులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని శిక్షణ పొందిన మధ్యవర్తులతో ఒకరోజు దిశా నిర్దేశ (ఓరియంటేషన్) కార్యక్రమాన్ని ఏలూరు బార్ అసోసియేషన్ హాలు నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వము ద్వారా కేసుల పరిష్కారానికి 90 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు శిక్షణ పొందిన మధ్యవర్తులకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక రోజు దిశా నిర్దేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయ పరిష్కారం అందించే దిశగా అందరూ కృషి చేయాలని కోరారు. రెండవ అదనపు జిల్లా జడ్జి యు ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ ఇరు పార్టీలను సమన్వయం చేసి మధ్యవర్తిత్వం నిర్వహించడం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్ ప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రిసోర్స్ పర్సన్ సుదర్శన సుందర్, విజయ కమల, న్యాయవాదులు పాల్గొన్నారు.